కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 95 వేల మంది ఆధార్ కార్డులను సస్పెన్షన్‌లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ నమోదు చేసుకుని, నంబర్ పొందినప్పటికీ వారి వేలి ముద్రలు, కనుపాపలు సక్రమంగా నమోదు కాకపోవటంతో యూఐడీ అధికారులు వారి ఆధార్‌ను పక్కన పెట్టారు. వీరందరికీ సంబంధించిన జాబితాను యూఐడీ అధికారులు బెంగళూరు నుంచి పంపారు. ఆ జాబితాను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చౌక ధరల దుకాణాల్లో ప్రదర్శించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఆ జాబితాలోని వారంతా దగ్గర్లో ఉన్న మీ-సేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో ఉన్న శాశ్వత ఆధార్ సెంటర్లలో వేలిముద్రలు, కనుపాపలు నమోదు చేయించుకుని నమోదు పత్రం తీసుకోవాలని కోరారు. తిరిగి పాత ఆధార్ నంబర్‌తోనే పునరుద్ధరణ జరుగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారి ఉమామహేశ్వరరావు చెప్పారు.