సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): శనగ రైతుల వివరాల సేకరణలో స్పష్టత కరువవుతోంది. గోదాముల్లో రికార్డులు గందరగోళంగా ఉండడంతో సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహానికి తాము దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న శనగ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. ప్రోత్సాహకానికి అర్హులైన రైతుల వివరాలు మార్కెట్‌యార్డు అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా రబీలో 2.20 లక్షల హెక్టార్లలో శనగ సాగవుతోంది.
ఇందులో అత్యధికంగా కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్లలో సాగు చేస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి శనగకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరుచుకుని మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పప్పుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. క్వింటాకు రూ.1500 చొప్పున, ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు ఐదు ఎకరాల వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా రూ. 45 వేలు ప్రోత్సాహం అందించేందుకు నిధులు కేటాయించారు.
అయోమయంలో సన్న, చిన్నకారు రైతులు..
పంట ఉత్పత్తులు భద్రపరిచిన గోదాము రికార్డుల ఆధారంగా అధికారులు..శనగ రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతోపాటు పంట ఉత్పత్తుల నిల్వలపై వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు వివరాలు సేకరిస్తున్నారు. రెండు, మూడు ఎకరాలు ఉండి పది, ఇరవై క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని సన్న చిన్నకారులు దిగుబడులను.. పెద్ద రైతుల పేరున భద్రపరుకున్నారు. దీంతో వీరి వివరాలు గోదాము రికార్డుల్లో నమోదు కాలేదు. దీనికి తోడు ఎక్కువశాతం మంది సన్న, చిన్నకారు రైతులు పంట ఉత్పత్తులపై బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం దరి చేసే అస్కారం లేకపోవడంతో వీరు ఆందోళన చెందుతున్నారు.
దీనికి తోడు గోదాముల్లో ఎంత మంది రైతులకు సంబంధించిన పంట ఉత్పత్తులు నిల్వ ఉన్నాయన్న పూర్తిస్థాయి సమాచారం లేకపోవడం సమస్యగా మారింది. గోదాముల్లో వ్యాపారులు సైతం రైతుల పేరున శనగ బస్తాలను నిల్వ చేసుకున్నారు. కొన్నిచోట్ల వ్యవసాయ, రెవెన్యూ రికార్డుల్లో పంటలసాగు నమోదు వివరాలు కూడా లేకపోవడం, అరకొరగా ఉన్న రికార్డుల్లో ఆ వివరాలు స్పష్టంగా లేకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించాలి..
వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వివరాలు సేకరిస్తే అన్ని విధాలా న్యాయం జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు, గత, రెండు మూడేళ్లలో ఆ పొలాల్లో రైతులు సాగు చేసిన పంటల వివరాల ఆధారంగా వివరాలు సేకరించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహంలో సన్న, చిన్న కారు రైతులకు అన్యాయం జరుగకుండా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment