రాజాంలో ఓ పాప కథ
Published Wed, Oct 2 2013 1:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
రాజాం రూరల్, న్యూస్‌లైన్: స్వార్థ చింతన తప్ప సేవాభావం లేని సమాజమిది. అబలలను.. అభం శుభం తెలియని చిన్నారులను చిదిమేసే దుర్మదాంధులతో నిండిపోయిన ఈ సమాజంలో సేవాభావం.. ఆదుకునే మనసున్న మారాజులు ఇంకా అక్కడక్కడా ఉన్నారు. రాజాంలో తప్పిపోయి రోడ్డున పడిన ఓ చిన్నారి 5 గంటల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చేరిన ఉదంతమే దీనికి నిదర్శనం. ఆ చిన్నారి సృష్టించిన కలకలం మీరూ చూడండి.. చదవండి.. మంగళవారం ఉదయం.. సమయం 8 గంటలు..
రెండుమూడేళ్లు కూడా నిండని పసితనం.. కళ్లలో బేలతనం.. మాటలు కూడా రాని లేలేతప్రాయం.. చిట్టి చేతుల్లో చిన్ని పలక.. బుడిబుడి అడుగులతో రోడ్డుపైకి వచ్చిందో చిన్నారి. అప్పటికే రద్దీగా మారిన సారధి రోడ్డు, శ్రీనివాస థియేటర్ రోడ్డు, బస్టాండ్ రోడ్డు మీదుగా మాధవ బజార్ జంక్షన్ సమీపంలోకి వెళ్లింది. రోడ్డున పోయేవారు ఆ చిట్టితల్లిని చూసి ఎవరీ పాప.. ఇలా ఒంటరిగా వెళుతోంది.. అని విస్తుపోతూ చూశారు. కొందరు వాహనాల బారి నుంచి ఆ చిన్నారిని రక్షించి రోడ్డు దాటించారే తప్ప.. ఆమెను పోలీసులకు అప్పగించే ప్ర యత్నం చేయలేదు. అలా ఆ పాప మాధవ బజార్ ఫుట్‌పాత్ షాపుల వద్దకు చేరుకుం ది. నడిచినడిచి అలసిపోయిందేమో..ఓ దుకాణం వద్ద కూర్చుండిపోయింది.
అప్పటికిగాని అక్కడి దుకాణదారులకు అనుమానం రాలేదు. వెంటనే విలేకరులకు సమాచారం అందించారు. వారు ఇద్దరు సామాజికవేత్తల సాయంతో ఆ చిట్టితల్లిని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అలసి సొలసిన ఆ పాప ఆస్పత్రి బెంచిపైనే నిద్రలోకి జారుకుంది. ఇలా 5 గంటలు గడిచాయి. ఈ వార్త పట్టణమంతా వ్యాపించి కలకలం రేపింది. అప్పటికే తమ కుమార్తె కనిపించక వెతుకులాట ప్రారంభించిన చిన్నారి తల్లిదండ్రులు రమాశంకర్, రచనాకుమారిలు పాప ఆస్పత్రిలో ఉన్న విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకుని.. పరుగున వచ్చి అక్కున చేర్చుకున్నారు. ఆనందభాష్పాలు రాల్చారు. కథ సుఖాంతమైనందుకు స్థానికులూ సంతోషించారు.
Advertisement
Advertisement