ఆవేదనలో సత్యసాయికృష్ణ తల్లిదండ్రులు, చైనాలో చిక్కుకున్న, దొంతంశెట్టి సత్యసాయికృష్ణ
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న భారతీయుల్లో మన జిల్లా వాసి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేపగా, అతడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజాం పట్టణం కాలెపువీధికి చెందిన దొంతంశెట్టి సత్యసాయికృష్ణ టీసీఎల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై శిక్షణ నిమిత్తం అక్కడకు వెళ్లాడు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. వైద్య పరీక్షల్లో టెంపరేచర్ డౌన్‌గా ఉందని ఇతడితోపాటు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన యువతిని పంపేందుకు అనుమతి నిరాకరించింది.
సత్యసాయికృష్ణ గతేడాది ఆగస్టులో తమిళనాడులోని వెల్లూరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎల్ కంపెనీ ఉద్యోగిగా ఎంపికయ్యాడు. వెంటనే కంపెనీ ట్రైనింగ్ నిమిత్తం ఈయనతోపాటు మరో 89 మందిని చైనాలోని వ్యూహాన్ సిటీ తీసుకెళ్లింది. వీరిలో కొంతమంది రెణ్నెల్ల క్రితం ఇండియాకు వచ్చేయగా, సత్యసాయికృష్ణతోపాటు మరో 57 మందికి శిక్షణ కాలం ఆర్నెల్లకు పొడిగించడంతో ఉండిపోయారు. ఇంతలో వ్యూహాన్‌లో కరోనా వైరస్ విజృంభించడంతో చైనా ప్రభుత్వం ఎవరినీ పంపకుండా నిషేధం విధించింది.
వచ్చిన అవకాశం చేజారింది...
కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో 11 రోజుల క్రితం 600 మంది రెండు విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారు. పది మందిని మాత్రం చైనా ప్రభుత్వం ఇండియా పంపేందుకు అనుమతించ లేదు. వీరిలో టీసీఎల్ కంపెనీ నుంచి వెళ్లిన రాజాం పట్టణానికి చెందిన సత్యసాయికృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన మరో యువతి ఉన్నారు. వీరిద్దరికి ఆ రోజు వైద్య పరీక్షల్లో టెంపరేచర్ డౌన్‌గా ఉందని చైనా ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కుటుంబీకులు తెలిపారు.
ఎదురు చూస్తున్న కుటుంబీకులు...
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యసాయికృష్ణ విట్ ఎంట్రన్స్ టెస్టులో ర్యాంకు సాధించడంతో అక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ సీటు లభించింది. ఈ కోర్సు చివరి సంవత్సరంలో ఉండగా, టీసీఎల్ కంపెనీ తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది. చైనాలో శిక్షణ ముగించుకుని ఈ నెల మొదటి వారంలో ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలోనే కరోనా వైరస్ కారణంగా వ్యూహాన్ సిటీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇతడి రాక కోసం తల్లి శ్రీదేవి, నానమ్మ భద్రమ్మ, సోదరి గాయత్రి ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల ప్రయత్నాలు..
ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఈ విషయం పెట్టామని, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఓ తెలుగు మహిళ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తుందన్నారు.
యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాం...
తన కుమారుడికి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందుతున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ వంటివి ఇవ్వడం లేదు. గతంలో వీరికి వండి పెట్టే వంటమనిషి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రోజూ మాస్‌్కలు ధరించి దగ్గర్లో క్యాంటీన్‌కు వెళ్లి బిస్కెట్లు, పండ్లు వంటివి తీసుకుంటున్నారు. తన కుమారుని యోగక్షేమాలు రోజు ఫోన్ ద్వారా తెలుసుకుంటూ కాలం గడుపుతున్నాం.
– సత్యసాయికృష్ణ తండ్రి శ్రీనివాసరావు, రాజాం
Comments
Please login to add a commentAdd a comment