సంతమాగులూరు, న్యూస్‌లైన్ : కుటుంబ సభ్యులంతా దైవదర్శనానికి వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ విషాదకర సంఘటన గుంటూరు-కర్నూలు రహదారిపై కామేపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగింది. ముందు వెళ్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్ లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో బల్లికురవ మండలం గుంటుపల్లికి చెందిన ఓగూరి అశోక్(27), ఆయన తండ్రి అంజయ్య(55) దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున అశోక్ తల్లి కుమారి, సోదరి అరుణ.. ఆమె కుమార్తె, స్నేహితుడు వెంకటశివలు తీవ్రగాయాలపాలయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడకు వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసి నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వివరాలు.. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఓగూరి అంజయ్య, కుమారి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అశోక్ ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉన్నత శ్రేణి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. కుమార్తె అరుణకు వివాహమై ఒక కుమార్తె. ఈ నేపథ్యంలో అంజయ్య, అయన భార్య కుమారి, వారి కుమార్తె అరుణ.. ఆమె కుమార్తెతోపాటు అశోక్ స్నేహితుడు, కొప్పెరప్పాడుకు చెందిన వెంకటశివ ఆదివారం ఉదయం బస్సులో శ్రీశైలం వెళ్లారు.
హైదరాబాద్ నుంచి అశోక్ కారులో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం వచ్చాడు. అందరూ కలసి దైవదర్శనం ముగించుకుని సోమవారం ఉదయం కారులో ఇంటికి బయల్దేరారు. అప్పటికే అశోక్‌కు రోజంతా నిద్రలేదు. తప్పక కారు నడపాల్సి వచ్చింది. కారు కామేపల్లి సమీపంలోకి రాగానే అశోక్ కునుకు తీశాడు. అంతే వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్ లారీని బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం లారీ కిందకు చొరబడిపోవడంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారందరూ రేకుల మధ్య చిక్కుకుపోయారు. సమాచారం తెలిసిన ఎస్సై ఎ.శివనాగరాజు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని కారులో చిక్కుకున్న తండ్రి అంజయ్య, కుమారి, అరుణ ఆమె కుమార్తెతో పాటు వెంకటశివను బయటకు తీశారు. అప్పటికే అంజయ్య కూడా మృతి చెందాడు. క్షతగాత్రులను పోలీస్ జీపులోనే నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలకు పంచనామా నిర్వహించి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఎ.శివనాగరాజు తెలిపారు.
దైవదర్శనానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
Published Tue, Nov 26 2013 6:16 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement