
అమ్మ భారమైంది..!
నంద్యాలటౌన్: చిన్న దెబ్బతగిలితే అమ్మా..అని అరుస్తాం. పెద్ద కష్టమొచ్చినప్పుడు.. ఆ మాతృమూర్తి ఓదా ర్పు కోసం పరితపిస్తాం.
నంద్యాలటౌన్: చిన్న దెబ్బతగిలితే అమ్మా..అని అరుస్తాం. పెద్ద కష్టమొచ్చినప్పుడు.. ఆ మాతృమూర్తి ఓదా ర్పు కోసం పరితపిస్తాం. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు సలహాలు అడుగుతాం..అల్లరి చేస్తున్నా గోము చేసే అమ్మంటే అందరికీ అభిమానమే. అలాంటి అమ్మకే కష్టమొస్తే..సంతానం అండగా నిలవాలి. మేమున్నాంటూ భరోసానివ్వాలి. అయితే ఓ వృద్ధురాలికి ఎలాంటి ఆసరా దొరకడం లేదు. నంద్యాల ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఆమెను కుమారులు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. పైగా వృద్ధురాలిపోషణపై పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. పతనమవుతున్న మానవతా విలువలకు ఈ ఘటన ఓ మచ్చు తునకగా మిగిలింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన నాగేశ్వరరెడ్డి, అచ్చమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూనే వారిని పెంచి పెద్ద చేశారు. మొదటి కుమారుడు పాండురంగారెడ్డి డ్రైవర్‌గా నంద్యాలలో స్థిరపడగా, రెండో కుమారుడు రంగారెడ్డి సైన్యంలో పని చేసి వచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. ఐదుగురు కుమార్తెలు పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు. వృద్ధాప్యంలో మతిస్థిమితం లేక ఇటీవలే నాగేశ్వరరెడ్డి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో అచ్చమ్మ(70) ఒంటరి అయింది. ఇటీవల ఆమెకు పక్షవాతం సోకి మంచం పట్టింది. గిద్దలూరులోనే ఉన్న కుమార్తె లక్ష్మి ఆమెను నాలుగు రోజుల క్రితం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. అచ్చమ్మ ఆహారం తీసుకోలేక పోవడంతో కేవలం రసాలు, కొబ్బరి నీళ్లను తాపిస్తున్నారు. రోజురోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. తల్లి చావు బతుకుల మధ్య ఉంటే... కుమారుడు పాడురంగారెడ్డి, ఐదుగురు కుమార్తెలు నంద్యాల టూటౌన్ పోలీసు స్టేషన్లలో శుక్రవారం పంచాయితీ పెట్టారు. తల్లి బాగోగులు చూడటానికి తాము ఆర్థికంగా సహాయం చేస్తామే కాని, సేవలు చేయడానికి అత్తింటివారు అంగీకరించబోరని కుమార్తెలు చెబుతున్నారు. తాను వికలాంగుడినని, తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అమ్మకు సపర్యలు చేయలేనని పాండురంగారెడ్డి పోలీసుల వద్ద వాదిస్తున్నారు. పెద్ద కుమారుడు రంగారెడ్డిని పిలిపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాని వీరి పంచాయితీ తెగేలోగా అచ్చమ్మ మృత్యు ఒడిలోకి వెళ్లిపోయే దీన పరిస్థితిలో ఉంది.