నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
ఒంగోలు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. మండల స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్యాధికారులతో స్థానిక అంబేద్కర్ భవన్‌లో బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీలో తహసీల్దార్, ఆర్‌డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి గ్రామాల వారీగా సమీక్షించుకుని అందుబాటులో ఉన్న నిధులతో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించుకోవాలని కమిటీలను ఆదేశించారు.
మూడు నెలలకు సరిపడా మందులు ఉండాలి...
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులను కలెక్టర్ హెచ్చరించారు. రానున్న మూడు నెలలకు సరిపడా మందులను ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు తహసీల్దార్ అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. వరదలు, తుఫాన్లు, కరువులు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
15 రోజుల్లో స్థలాలు సేకరించాలి...
జిల్లాలో ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. 15 రోజుల్లో స్థలాలను సేకరించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకోసం వెయ్యి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నారు. అందుకు అనువైన స్థలాల కోసం తహసీల్దార్లంతా గ్రామాల్లో పర్యటించి సేకరించాలని సూచించారు. ఇందిరమ్మ పచ్చతోరణం పథకం కింద ఒక్కో మండలంలో వెయ్యి ఎకరాల్లో మొక్కలు పెంచనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గానికి సీనియర్ అధికారి...
రెండోవిడత అక్షర విజయం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారిని నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డివిజన్‌లో 1.82 లక్షల మంది నిరక్షరాస్యులుండగా, మొదటి విడతలో లక్షా 2వేల మందిని అక్షరాస్యులను చేసినట్లు చెప్పారు. మిగి లిన వారిని రెండో విడతలో అక్షరాస్యులను చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకంలోని జాబ్ కార్డుదారులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాదర్‌గౌడ్, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, జిల్లా పరిషత్ సీఈవో ప్రసాద్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు.