పింఛన్ల సర్వేలో తేడాలొస్తే అధికారులే బాధ్యులు
కలెక్టర్ విజయకుమార్ హెచ్చరిక
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే పింఛన్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, సర్వేలో ఏదైనా తేడాలు వస్తే కమిటీలో ఉన్న ప్రభుత్వ అధికారులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను హెచ్చరించారు. ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇచ్చిన సూచనలు పాటించి సర్వే చేయాలన్నారు.
ఎంపికైన కమిటీ సభ్యులకు అవగాహన కల్పించి సర్వే చేయాలని, ఏ ఒక్క అర్హునికి అన్యాయం జరగకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వితంతువులు, వికలాంగులు, చేనేత పింఛన్లలో వయసుతో ఇబ్బంది లేదని, వృద్ధాప్య పింఛన్లతో వయసు నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో సర్వే సమయంలో రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుల్లో ఎందులో ఎక్కువ వయసు ఉంటుందో దాన్ని పరిగణించాలని సూచించారు. పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్, అవుట్సోర్సింగ్, నెలసరి జీతం, 2.50 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట ఉన్న వారు, ఆదాయపన్ను చెల్లించేవారు, కారు ఉన్న కుటుంబ యజమాని పింఛన్‌కు అర్హులు కాదని చెప్పారు. సర్వేలో ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేకుండా సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పచ్చని ప్రకాశం కోసం లక్ష మొక్కలు: జెడ్పీ చైర్మన్
పచ్చదనం, పరిశుభ్రతలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వెల్లడించారు. జిల్లాను పచ్చని ప్రకాశంగా తీర్చిదిద్దడంలో ఈ నెల 20వ తేదీన లక్ష మొక్కలను నాటేందుకు నిర్ణయించినందున నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆ రోజున జిల్లావ్యాప్తంగా మొక్కలను నాటాలని ఆదేశించారు. ఈ మొక్కలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆవరణలో, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో నాటడంతో పాటుగా మొక్కలను నాటేందుకు ముందుకు వచ్చిన వారందరినీ ప్రోత్సహించాలని, మొక్కలను నాటడమే లక్ష్యంగా కాకుండా పూర్తి సంరక్షణను కూడా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
జిల్లాను పరిశుభ్రంగా తయారు చేసేందుకు మండలంలోని 2 గ్రామాలను ఎంపిక చేసి అక్టోబర్ 2వ తేదీ నాటికి వంద శాతం పూర్తి చేయడమే కాకుండా వాటిని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా చేస్తారని, ఈ విషయంలో పాఠశాల హెడ్మాస్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు.
డీఆర్డిఎ పీడీ పద్మజ మాట్లాడుతూ ఈ నెల 19,20 తేదీల్లో పింఛన్ల పరిశీలన కార్యక్రమానికి కమిటీ సభ్యులను నియమించని మండలాలు వెంటనే జాబితా అందజేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సూచించారు. ఆధార్ అనుసంధానం లేని పింఛన్‌దారుల వివరాలను సేకరించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. కమిటీ సభ్యుల నియామకం, కమిటీ సభ్యుల సమావేశం, 19,20వ తేదీల్లో పరిశీలన, తర్వాత ఎంపీడీఓలు లాగిన్‌లో అప్లోడ్ చేయాలని ఆమె వివరించారు.
ఒకరోజు వేతనం కట్ - జెడ్పీ సీఈఓ
కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఒకరోజు వేతనం కట్ చేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఎ.ప్రసాద్ స్పష్టం చేశారు. అంతేగాకుండా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ పోలప్ప, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నరసింహారావు పాల్గొన్నారు.