ఆధార్.. బేజార్ | Aadhaar .. bejar | Sakshi
Sakshi News home page

ఆధార్.. బేజార్

Published Tue, Sep 16 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

ఆధార్.. బేజార్

ఆధార్.. బేజార్

అనంతపురం సప్తగిరి సర్కిల్ :
 ‘పింఛన్-ఆధార్’ సీడింగ్ ప్రహసనంగా మారింది. నెలలు గడుస్తున్నా కొలిక్కిరావడంలేదు. డీఆర్‌డీఏ-ఐకేపీ పింఛన్ విభాగం అధికారులు, సిబ్బంది కంప్యూటర్ల ముందు కూర్చుని కుస్తీ పడుతున్నారు. మరోవైపు సీడింగ్ లేనిదే అక్టోబర్ నుంచి పింఛన్ ఇవ్వబోమని అధికారులు చెబుతుండడంతో వేలాది మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పెంపు అక్టోబర్ నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. సామాజిక భద్రతా పథకం కింద వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు.. ఇతరత్రా లబ్ధిదారులకు రూ.200 నుంచి రూ.వెయ్యి, 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి రూ.1,500 ప్రకారం పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆధార్ కార్డుతో లింక్ పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 4,10,388 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య 2,21,687, వితంతు 1,04,854, చేనేత 11,667, అభయహస్తం 18,079, వికలాంగ 53,972, కల్లుగీత పింఛన్‌దారులు 129 మంది ఉన్నారు. ప్రతినెలా కాస్త అటూ ఇటుగా రూ.11.02 కోట్లు పంపిణీ చేస్తున్నారు. అన్ని రకాల పెన్షన్‌కార్డు ఐడీలకు ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఆర్‌డీఏ-ఐకేపీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఆధార్ వివరాలను సేకరిస్తున్నారు. రెండు నెలల నుంచి 3.60 లక్షల మంది వివరాలను సేకరించారు. ఇందులో 3.15 లక్షల మంది సీడింగ్ పూర్తి చేశారు. సీడింగ్ సమయంలో ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (యూఐడీ) నంబరుకు పింఛన్ ఐడీకి అనుసంధానం కావడం లేదు. మొదట్లో ఇలాంటి వాటి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. రానురాను పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 35 వేల వరకు ‘మిస్ మ్యాచింగ్’ జాబితాలో చేరిపోయాయి. ఇంకా సీడింగ్ చేయాల్సినవి చాలా ఉండడంతో ఈ జాబితా మరింత పెరిగే అవకాశముంది. ‘మిస్ మ్యాచింగ్’ జాబితాలోని పింఛన్‌దారుల వివరాలు మరోసారి సేకరించాలని రెండు రోజుల కిందట క్లస్టర్ ఏసీలు, మండల స్థాయి ఏపీవోలను అధికారులు ఆదేశించారు. గ్రామాల వారీగా ఇంటింటికీ వెళ్లి సరైన ఆధార్ యూఐడీ సేకరించాలని సూచించారు. ఇదంతా నాలుగు రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు సోమవారం సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయక పోవడంతో సీడింగ్ మందకొడిగా సాగింది. ఇంకా 50 వేల మంది నుంచి ఆధార్ సేకరించాల్సి ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇప్పటికీ ఆధార్‌కు ఎన్‌రోల్ కూడా చేసుకోలేదని సమాచారం. ఆధార్ ఉన్న వారు కూడా పొరపాట్ల కారణంగా యూఐడీ నంబర్ ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా తీయించుకుందామన్నా మీ-సేవా కేంద్రాల్లో అరకొర సేవలు అందుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. మొత్తమ్మీద ఆధార్-పింఛన్ అనుసంధాన ప్రక్రియ అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా పరిణమించింది. దీనివల్ల అక్టోబర్ నుంచి వేలాది మందికి పింఛన్ అందడం ప్రశ్నార్థకంగా మారింది. 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement