
విద్యార్థులకూ ‘ఆధార్’ !
శ్రీకాకుళం: అన్నివర్గాల వారిని ఆందోళనకు గురిచేస్తున్న ఆధార్ నంబర్ల అనుసంధానం తాజాగా విదార్థులను తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న సరస్వతీ పుత్రుల ఆధార్ నంబర్లను సేకరించి వాటిని రికార్డుల్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలో శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణ యం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూని ఫారాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపకార వేతనాలను కూడా అందజేస్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకుగానూ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లను నమోదు చేస్తున్నట్టు రాష్ట్ర అధికారులు గుర్తించారు.
పాఠశాలల్లో చదవని విద్యార్థుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయడం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అలాగే ఎనిమిదేళ్ల క్రితం పాఠశాలలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల వివరాలను ఇటీవల పరిశీలించి వీరు 8వ తరగతిలో చేరేరా లేరా అన్నది పరిశీలించగా జిల్లాలో ఐదు వేల మంది వరకు తగ్గినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే ఉండడంతో ఇటువంటి వాటిని అరికట్టడం ద్వారా ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయించారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల్లో అనుమతులకు మించి విద్యార్థులను చేర్చుకుంటూ ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఇలా చేయడం వల్ల పన్నుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని రాష్ట్ర అధికారులు భావించారు. ఇటువంటి వాటిని అరికట్టాలని, విద్యార్థి పేరు ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో ఏదో ఒక చోట మాత్రమే ఉండేలా చూడాలని నిర్ణయించి ఆధార్‌కార్డు నంబర్‌ను విద్యార్థుల రికార్డులో నమోదు చేస్తే చాలా వరకు అరికట్ట వచ్చునని సర్కార్ భావించింది. వెంటనే ఆధార్ నంబర్లను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొందరు అవినీతి అధికారులు చిత్తశుద్ధితో ఈ పని చేస్తారా లేనా అని అనుమానించి భవిష్యత్‌లో ఆధార్ నంబర్‌ను 10వ తరగతి మార్కుల జాబితా లో నమోదు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం.