ఆధార్ ఉంటేనే మార్కుల లిస్ట్‌లు
ఇంటర్ విద్యార్థులకు తప్పనిసరి
పెదవాల్తేరు : రేషన్ కార్డుకు, గ్యాస్‌కు, బ్యాంక్ ఖాతాకు, వాహనాలకు.. ఇలా మానవుని దైనందని జీవనానికి సంబంధించి ప్రతీ దానికి ఆధార్ కార్డు తప్పనిసరైంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కుల లిస్ట్‌లకు ఆధార్ లింకు పెట్టారు. విద్యార్థులు ఆధార్ కార్డు అందించకపోతే మార్కుల లిస్ట్ అందే పరిస్థితి లేదు. 2014-15 విద్యాసంవత్సరంలోనే ప్రతీ విద్యార్థికి ఆధార్ కార్డు ఉండాలని బోర్డు సూచించింది. కళాశాలలో చేరినప్పుడే విద్యార్థులు దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు కూడా కళాశాలకు సమర్పించాలని నిబంధన పెట్టారు.
చాలా మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేకపోయినా చేర్పించుకున్నారు. ప్రవేశాల తర్వాత అయినా ఆధార్ కార్డులు నమోదు చేసుకుని సమర్పిస్తారని భావించారు. అప్పటికీ ఇవ్వకపోవడంతో పరీక్ష ఫీజు చెల్లించినప్పుడు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలని నిబంధనలు పెట్టారు. ఇదీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతో మార్కులిస్ట్‌లకు ఆధార్ లింకు పెట్టారు.
ఆధార్ నంబర్ నమోదు చేస్తేనే...
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి ప్రయోగ పరీక్షలు, మార్చి 11 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు జిల్లా నుంచి లక్షా 546 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరందరికి ఆధార్ కార్డులు ఉండాలి. లేదంటే వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులైనా మార్క్‌లిస్ట్‌లు రావు. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు నంబర్ నమోదు చేస్తే విద్యార్థి మార్కుల జాబితా వస్తుంది.
మూడు నెలల్లో ఆధార్ కార్డు పొందాల్సిందే...
జిల్లాలో 304 జూనియర్ కళాశాలలో లక్షా 546 మంది చదువుతుంటే వీరిలో పొరుగు జిల్లాల విద్యార్థులు సుమారు 25 వేల మంది ఉన్నారు. నగరంలోని కార్పొరేట్ కళాశాలలో ఉంటూ వీరందరూ చదువుతున్నారు. వీరు ఇంటికి వెళ్లే సందర్భాలు తక్కువ. పరీక్షల సమయంలో ఆధార్ కార్డు నమోదు చేయించుకోవాలంటే ఇబ్బందికరమే. సాధారణంగా ఆధార్ కార్డు పొందడానికి 15 నుంచి 30 రోజులు పడుతుంది. పరీక్షల అనంతరం రెండు నెలల సమయం విద్యార్థులకు ఉంటోంది. ఈ లోపు వారు ఆధార్ కార్డులు పొందితే ప్రయోజనకరంగా ఉంటోంది.