‘అంగన్‌వాడీ’లో మధ్యాహ్న భోజనం మిథ్యే! | 'AANGANWADI' Myth in the mid-day meal! | Sakshi
Sakshi News home page

‘అంగన్‌వాడీ’లో మధ్యాహ్న భోజనం మిథ్యే!

Published Sat, Sep 21 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

'AANGANWADI' Myth in the mid-day meal!

పెడన/బంటుమిల్లి రూరల్, న్యూస్‌లైన్ : అంగనవాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజన పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సరుకులు అందక చాలీచాలనీ మెతుకులతో కాలంవెళ్లదీస్తున్నారు. మొన్నటి వరకు పౌష్టికాహారం అందించిన చిన్నారులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ వనరుల లోపంతో  క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది.

దీంతో చిన్నారులకు, గర్భీణీలకు, బాలింతలకు ఇటు పౌష్టికాహారం (ఎంటీఎఫ్)... అటూ మధ్యాహ్న భోజనం అందకుండా పోపొయింది.జిల్లా వ్యాప్తంగా 3,630 అంగనవాడీ కేంద్రాలు, 208 మినీ సెంటర్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలంటూ మాతా శిశు సంక్షేమ శాఖాధికారులు అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 1.23 లక్షల మందికిపైగా 3 నుంచి 6 ఏళ్లున్న పిల్లలు, బాలింతలు, గర్భీణీ లు  లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేయకపోవటంతో వారే స్వయంగా తమ సొంత నగదు వెచ్చించి సరుకులు కొని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులతో పథకాన్ని ప్రారంభింపజేశారు. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలలో అధికారులు సరుకులు పంపిణీ చేయకపోవడటంతో ఆ రెండు మాసాలు మళ్లీ పౌష్టికాహారంతోనే సరిపెట్టారు.

 అరకొర సరుకులు పంపిణీ....

 సెప్టెంబర్ మాసంలో మాతా శిశు సంక్షేమ శాఖాధికారులు ఆయా మండలాల పరిధిలో ఉన్న తహశీల్దార్లకు డీడీ  కట్టి రేషన్‌ను అంగనవాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని కోరారు. దీంతో ఈ నెల నుంచి బియ్యం, పప్పు మాత్రమే పౌర సరఫరా అధికారులు ద్వారా అందజేశారు.  పురుగులు పట్టిన బియ్యం, కంది పప్పు ఉడికి ఉడకనిది సరఫరా చేయటంతో, బాలింతలు, చిన్నారులకు, గర్భీణీలకు వాటితో ఏవిధంగా భోజనం వండి వార్చాలని   అంగన్‌వాడీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

 వంటచెరకు మాటేంటి?

 ఒక్కో అంగనవాడీ కేంద్రంలో 15 నుంచి 20 మంది చిన్నారులుంటారు.  వంట చెరకు నిమిత్తం ఒక్కోక్కరికి 20 పైసలు చోప్పున ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. నెలలో 25 రోజులకు మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం గ్యాస్ ధర రూ. వెయ్యికు పైగా పలుకుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రేటుకు మధ్యాహ్నభోజనం వండటం సాధ్యం కాదని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపొతున్నారు.
 
 అసలే ఇరుకు గదులు...

 అంగనవాడీ కేంద్రాలు చాలా వరకు ఇరుకు గదుల్లో మగ్గుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యి సెంటర్లకు సొంత భవనాలున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దే భవనాల్లో కొనసాగుతున్నాయి. మున్సిపాల్టీల్లో అంగనవాడీ కేంద్రాలకు స్థలాల  కొరత వేధించటంతో ప్రైవేటు భవనాల్లో నామమాత్రంగా కొనసాగుతున్నాయి.  

 మూడు నెలలుగా వేతనాల్లేవ్....

 మూడు నెలల  నుంచి వేతనాలందక  సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు నెల నెలా అద్దె సకాలంలో చెల్లించకపోతే భవన యజమానులు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు. దీంతో అప్పు చేసి అంగనవాడీ కేంద్రాల అద్దెలు చెల్లిస్తున్నామని పెడన అంగనవాడీ కార్యకర్తలు వాపాతున్నారు. కాగా  పోషకాహారం పంపిణీపై సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం పడింది. అంగన్‌వాడి కేంద్రాలకు నేటికీ సరుకులు సరఫరా కాకపోవడంతో సెప్టెంబరునెల రేషన్ లబ్ధిదారులకు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు  సమ్మెలో పాల్గొంటున్న కారణంగా ఇండెంట్లు, బిల్లులు తయారుచేసేవారులేక   సరుకుల సరఫరా నిలిచిపోయింది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement