ప్రజాప్రతినిధులకే తొలగింపు బాధ్యతలు
సర్కారు నుంచి ప్రత్యేక లేఖలు
అనుమానాస్పద వ్యక్తులకు పింఛన్లు కట్
హుజూరాబాద్ : ఆసరా పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా.. మంజూరుకు కట్టడి చేసినప్పటికీ ఆ తర్వాత అనర్హులకు సైతం లబ్ది చేకూరింది. దీంతో ఆసరా భారం సర్కారుకు తడిసి మోపెడైంది. ఈ నేపథ్యంలో సర్కారు పింఛన్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అనర్హులను తొలగించడానికి చర్యలకు ఉపక్రరించింది.
ప్రజాప్రతినిధులకు లేఖలు
ఉదాహరణకు జమ్మికుంట మండలం కొత్తపల్లిలో గతంలో 400 పింఛన్లు ఉండగా, ప్రస్తుతం ఆసరా పింఛన్లు 525 మంజూరయ్యాయి. అంటే ఒక్క గ్రామంలోనే సుమారు 125 పింఛన్లు అదనంగా పెరిగాయి. ఇలా జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పింఛన్ల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గిన దాఖలాలు అరుదు. పింఛన్ మొత్తం రూ.1000, వికలాంగులకు రూ.1500లకు పెరగడంతోనే పింఛన్‌దారుల సంఖ్య పెరిగిందనే విషయం వేరే చెప్పక్కర్లేదు.
తొలుత పైరవీలకు చాన్స్ లేదని కఠినంగా చెప్పినప్పటికీ చివరకు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులే పైరవీలకు దిగి పింఛన్లు ఇప్పించారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో 30-40శాతం వరకు అనర్హులకు జాబితాలో చోటుదక్కినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో సాక్షాత్తు మంత్రి కేటీఆర్ నుంచి జిల్లాలోని ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులకు ప్రత్యేకంగా లేఖలు వచ్చాయి. నేరుగా ఫిర్యాదు చేయకున్నా 18002001001 టోల్‌ఫ్రీ నంబర్‌గా ఫోన్ చేసైనా చెప్పవచ్చునని ఆ లేఖలో పేర్కొన్నారు.
సదరం సర్టిఫికెట్లపై నిఘా
వికలాంగులకు రూ.1500 పింఛన్ వస్తుండటంతో రకరకాల పైరవీలను ఆశ్రయించి సదెరం సర్టిఫికెట్లు సంపాదించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ప్రతీ సదరం సర్టిఫికెట్‌పై ముగ్గురు వైద్యులు ఆమోదం తెలపాలి. కాని దాదాపు సగం సర్టిఫికెట్ల మీద వైద్యుల సంతకాలు లేవు. ఇలాంటి సర్టిఫికెట్ల లబ్దిదారులకు పింఛన్లు నిలిపివేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు.
తాజాగా హుజూరాబాద్ పట్టణంలో దాదాపు 140 సదెరం సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలపై ముగ్గురు వైద్యుల సంతకాలు లేవు. వీరికి పింఛన్లు కూడా నిలిపివేశారు. మరోసారి విచారణ జరిపిన తర్వాత అర్హులని తేలితేనే వీరికి పింఛన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆసరా అక్రమాలకు చెక్
Published Fri, Feb 20 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement