ఏబీవీ.. బాబు రాజకీయానికి బినామీ | AB Venkateswara Rao is a benami of Chandrababu Politics | Sakshi
Sakshi News home page

ఏబీవీ.. బాబు రాజకీయానికి బినామీ

Published Thu, Mar 28 2019 4:43 AM | Last Updated on Thu, Mar 28 2019 9:51 AM

AB Venkateswara Rao is a benami of Chandrababu Politics - Sakshi

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆయన దర్జాగా కూర్చుంటారు .టీడీపీ ఆంతరంగిక సమావేశాల్లో దర్శనమిస్తారు. పోలీసు శాఖలో జరిగే బదిలీల్లో ఆయన చెప్పిందే జరుగుతుంది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తేనే జరుగుతుంది. టీడీపీ పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఏదైనా ఆయన సిఫారసు తప్పనిసరి. పేరుకు నిఘా విభాగం అ«ధిపతి అయినా అటు ప్రభుత్వం, ఇటు టీడీపీ సంస్థాగత నిర్ణయాల్లోనూ ఆయనదే పెత్తనం. ఆయనెవరో ఇప్పటికే అర్థమైంది కదూ.. ఆయనే అత్యంత వివాదాస్పదమైన పోలీసు అధికారిగా ముద్ర వేసుకున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ). అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ పనుల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఏబీవీ ఏకంగా చంద్రబాబు రాజకీయ బినామీగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. 

సాక్షి, అమరావతి/గుంటూరు: ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపైన దృష్టి పెట్డడం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాల్సిన పని ఇంటెలిజెన్స్‌ విభాగానిది. గతంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ప్రభుత్వంలో లోపాలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అరాచకాలపై ప్రభుత్వాని కి నివేదికలు అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించేది. అయితే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఎ.బి.వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. అధికారపార్టీ సేవలో ఆయన తరించిపోతున్నారు. టీడీపీ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసమే పనిచేసేలా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను మార్చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 

ఆది నుంచీ టీడీపీ సేవలోనే..
టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్‌ ఏడీజీగా ఉన్న ఏఆర్‌ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది. ఆయన, ఓఎస్డీ యోగానంద్‌ లాంటి అధికారులు కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు ఖాకీ యూనిఫారం వేసుకుని ఐక్యతను చాటే పోలీసు వ్యవస్థలో కులం కుంపటి రాజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలోని కీలక పోస్టుల్లో సీఎం సొంత సామాజికవర్గం వారితో నింపేశారని, మిగతా వారిని లూప్‌లైన్‌ (అప్రధాన) పోస్టుల్లో నియమించారని పోలీసులే వాపోతుండడం ఇందుకు నిదర్శనం. పోలీసు శాఖలో ఇలా కుల ప్రస్తావన గతంలో ఎప్పుడు లేదని సీనియర్‌ పోలీసు అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. 

ఎల్లో నెట్‌వర్క్‌గా మార్చేశారు..
భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక నుంచి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వరకు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం నిఘా వ్యవస్థను పణంగా పెడుతున్నారంటూ పోలీసు శాఖలో విమర్శలు రేగుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పూర్తిగా టీడీపీ రాజకీయ అవసరాలకోసం వినియోగించుకోవడంలో నంద్యాల ఉప ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. నంద్యాలలో ఏబీవీ మకాం వేసి పెద్దసంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను నియమించి టీడీపీకోసం సేవలందించినట్టు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంతో కూకట్‌పల్లిలో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థుల ఫోన్‌ల ట్యాపింగ్, టీడీపీ అభ్యర్థులకోసం సమీకరణలు చేయడం వంటి పనుల్లో ఇంటెలిజెన్స్‌ విభాగం పనిచేయడం వివాదాస్పదమైంది. తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల తరఫున డబ్బులు పంచుతున్నారంటూ ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ రంగంలోకి దిగి తమ వాళ్లు సమాచార సేకరణకు మాత్రమే వెళ్లారని, డబ్బులు పంచలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా ఇంటెలిజెన్స్‌ వాడకం..
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రత్యర్థులను దెబ్బతీసే చర్యల వరకు ఏబీవీ కీలకపాత్ర పోషిస్తూ ఇంటెలిజెన్స్‌ను ఎడాపెడా వాడేçస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అభ్యర్థులకోసం సర్వేలు, సమీకరణలు, ఏర్పాట్లలో ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నీడలా వెంటాడుతున్న ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని వారిని అదును చూసి దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని గుర్తించిన చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ పనిచేస్తున్న తీరు మరింత వివాదాస్సదమైంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి మూడు నెలల ముందు నుంచే ఇచ్చిన దాదాపు 26 జీవో(బదిలీ ఉత్తర్వులు)లతో కావాల్సిన వారిని కావాల్సిన ప్రాంతాల్లో నింపేశారు. సొంత నియోజకవర్గం, సొంత మనుషులతో ప్రతీ జిల్లాలోనూ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ, కీలక ప్రాంతాల్లోని శాంతిభద్రతల డీఎస్పీలను నియమించుకోవడంలో చక్రం తిప్పి ఇప్పుడు టీడీపీ సేవలో తరించేయడంలో డైరెక్షన్‌ ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 256 మంది ఇంటెలిజెన్స్‌ అధికారులు, సిబ్బందిని క్షేత్రస్థాయిలో పనిచేయిస్తున్నారు. వారినుంచి వస్తున్న సమాచారాన్ని రాష్ట్ర రాజధాని ప్రాంతంతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించి రాజకీయ కోణంలోనే పనిచేయిస్తున్నారని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

నిఘా వైఫల్యానికి మూల్యం..
మొత్తం నిఘా వ్యవస్థను పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు మళ్లించడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోర వైఫల్యం చెందాయి. రాష్ట్రంలో అలికిడి లేదనుకున్న మావోయిస్టులు మళ్లీ పంజా విసిరేవరకు నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది. గతేడాది విశాఖ మన్యం అరకులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడం, అనంతరం ఆగ్రహించిన గిరిజనులు అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనల్లో నిఘా వైఫల్యం ప్రస్ఫుటమైంది. ఇంటెలిజెన్స్‌ వైఫల్యం వల్ల అనేక దుర్ఘటనలు చోటు చేసుకుని వందలాదిమంది అమాయకులు బలయ్యారు. రాజధాని కేంద్రంలో సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో సొంత మనుషులను కాపాడుకునేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్‌ సాయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి. ఇక ఇసుక దందా, నీరు–మట్టి, బెట్టింగ్‌ మాఫియా, ఫెర్రీ వద్ద బోటు బోల్తా వంటి అనేక ప్రధాన ఘటనల్లో ముందస్తుగా అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారమిచ్చి ఉంటే.. నష్ట నివారణ జరిగేదని పోలీసుశాఖలోనే పలువురు చర్చించుకుంటున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల బేరసారాల్లో కీలకపాత్ర
రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి ఫిరాయించేలా బేరసారాలు నెరపడంలో ఏబీవీ కీలకపాత్ర వహించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ఫోన్లలో, నేరుగా ఇంటెలిజెన్స్‌ అధికారులతో మాట్లాడించి డీల్‌ కుదిర్చేవారన్న విమర్శలున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేయడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, ఇతర పైరవీలకోసం కోట్లాది రూపాయలతో రంగంలోకి దిగిన చంద్రబాబు మనుషులు నెరపిన రాజకీయ సమీకరణల్లో ఏబీవీ కీలకపాత్ర పోషించినట్టు విమర్శలు వచ్చాయి. 

ఆయన చెప్పిందే వేదం: పోలీసు శాఖలో సీఐ, డీఎస్పీ నుంచి డీజీపీ పోస్టింగ్‌ వరకు ఆయన చెప్పిందే చంద్రబాబు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనమే కారణమని చెబుతున్నారు. గత డీజీపీ నండూరి సాంబశివరావుకు రెండేళ్లు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వకపోవడంలోనూ, ఆ తరువాత అనేక పోస్టింగ్‌ల్లోనూ ఏబీవీ జోక్యం అప్పట్లో వివాదాస్పదమైంది. కొద్ది నెలలక్రితం గౌతమ్‌ సవాంగ్‌కు డీజీపీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగా.. చివరి నిమిషంలో సీఎం తనయుడు, మంత్రి లోకేశ్‌తో ఒత్తిడి చేయించి ఠాకూర్‌కు దక్కేలా చేయడంలో ఏబీవీ పోషించిన పాత్ర పోలీసు శాఖలోనే చర్చనీయాంశమైంది. నిబంధనను కచ్చితంగా అమలు చేసే ఐపీఎస్‌ అధికారిగా పేరున్న సవాంగ్‌ను డీజీపీగా చేస్తే ఎన్నికలప్పుడు తమ మాట వినరంటూ ఏబీవీ నేరుగా సీఎంపై ఒత్తిడి తెచ్చినట్టు సీనియర్‌ ఐపీఎస్‌లు చర్చించుకోవడం గమనార్హం. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ఏబీవీ జోక్యం ఏ స్థాయిలో ఉందో ఇటీవల విజయవాడలో జరిగిన సభలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అద్దంపట్టాయి. దేవినేని అవినాష్‌కు తెలుగు యువత అధ్యక్షుడి పదవికోసం తాను, గద్దె రామ్మోహన్‌.. ఏబీవీని కలసి సీఎంకు చెప్పాలని కోరామన్న బుద్దా వ్యాఖ్యలు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

టీడీపీ కార్యాలయంగా ఇంటెలిజెన్స్‌ కార్యాలయం..
ఏబీవీ నేతృత్వంలో ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయం టీడీపీ కార్యాలయంగా మారిపోయిందన్న విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిఘా విధులు నిర్వర్తించాల్సిన ఆ కార్యాలయం నిత్యం టీడీపీ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చడంకోసం ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఎల్లో నెట్‌వర్క్‌గా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎం ఆఫీసు, ఇంటెలిజెన్స్‌ మధ్య రిటైర్డ్‌ పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ యోగానంద్‌ సమన్వయం చేసుకుంటున్నట్టు సమాచారం. అటు సీఎం ఆఫీసు, ఇటు ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చే సమాచారంతో డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ పోలీసు యంత్రాంగా న్ని నడిపిస్తున్నట్టు పోలీసుశాఖలో చర్చ సాగుతోంది. ఈ కీలక అధికారులు జిల్లాలవారీగా తమ వారితో అనధికార వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు టీడీపీకోసం ఏమి చేయాలో డైరెక్షన్‌ ఇస్తున్నట్టు ఒక సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు.

ఓఎస్‌డీలుగా రిటైరైన అధికారుల నియామకం
ఇంటెలిజెన్స్‌ను ఐఎస్‌డబ్ల్యూ, ఎస్‌ఐవీ, సీఐ, పీఐ వంటి నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి డీఐజీ లేదా ఐజీ స్థాయి అధికారితోపాటు ఎస్పీలు, అడిషనల్‌ ఎస్పీలు పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ విభాగంలో బి.శ్రీనివాసులనే ఒక్క ఐజీ తప్ప మిగతా విభాగాలకు డీఐజీగానీ, ఐజీ స్థాయి అధికారిగానీ లేరు. రాష్ట్ర భద్రతపై నిరంతర నిఘా ఉంచాల్సిన ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఐజీ, డీఐజీ స్థాయి పోస్టులను ఖాళీగా ఉంచి పదవీ విరమణ చేసిన ఐజీ యోగానంద్, డీఐజీ రామకృష్ణ, అడిషనల్‌ ఎస్పీ మాధవరావులను ఓఎస్‌డీలుగా నియమించుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement