పాతబస్తీ లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం
Published Mon, Nov 11 2013 4:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
మూడు కిలోల బంగారం డిమాండ్ చేస్తూ రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటనను హైదరాబాద్ పొలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్నిచేధించిన హైదరాబాద్ స్పెషల్ పోలీసుల బృందం ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్ లో అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కు పాల్పడిన రాం ప్రసాద్ మిస్త్రీ, ప్రియాంక హల్దర్ లిద్దర్ని 24 పరగణాల జిల్లా దుమ్కి గ్రామం నుంచి నవంబర్ 9 తేదిన అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ గురైన ఆకాశ్ ను సురక్షితంగా తీసుకువచ్చామని మీడియాకు వెల్లడించారు.
కిడ్నాప్ గురైన ఆకాశ్ తండ్రి గోపాల్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రికాబ్ గంజ్ ప్రాంతంలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నారు. నవంబర్ 2 తేదిన తన అక్క అల్లుడు రాంప్రసాద్ మిస్తీ టపాసులు కొనిస్తానని తీసుకువెళ్లాడని.. ఆతర్వాత ఆకాశ్ రాకపోవడంతో పోలీసులకు గోపాల్ ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ చేసిన నిందితులు మూడు కిలోల బంగారాన్ని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మిస్త్రీ, ప్రియాంకలను అనుమానించారు. విచారణలో రాంప్రసాద్ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుడు గోపాల్ వద్ద పనిచేశారని.. కొన్ని విభేదాలు తలెత్తడంతో మిస్త్రీని ఉద్యోగం నుంచి తొలిగించడంతో కొంతకాలం కోల్ కతాకు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఆతర్వాత మళ్లీ హైదరాబాద్ కు వచ్చి ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. నిందిలిద్దర్ని టాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చి.. స్థానిక కోర్టులో హాజరుపరిచామన్నారు.
Advertisement
Advertisement