రాష్ట్రంలోని మహిళల రక్షణకు ఉద్దేశించి ‘అభయ’ పేరుతో ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల రక్షణకు ఉద్దేశించి ‘అభయ’ పేరుతో ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ తరహా కేసులు రాష్ట్రంలో ఎక్కడా చోటు చేసుకోకుండా.. ఏ సమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం తొలివిడతగా ఏపీకి కేంద్రం రూ.56 కోట్లు కేటాయించింది.
ఇదీ ప్రాజెక్టు..: క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేలా ‘అభయ’ ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం ‘అభయ’ మొబైల్ యాప్‌కు రూపకల్పన చేశారు. ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వస్తే క్యాబ్‌లు, ఆటోలకు జీపీఎస్ పరికరాలు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇవేగాక ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలన్నింటిలో జీపీఎస్ పరికరాలు అమర్చాలి. రవాణా, పోలీసుశాఖ సిబ్బంది కాల్‌సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. మహిళలకు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులెదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని విశాఖ, విజయవాడల్లో ‘అభయ’ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.