నాలుగున్నరేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు | Above 6 lakh crore corruption in last four and half years in state | Sakshi
Sakshi News home page

నాలుగున్నరేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు

Published Mon, Jan 7 2019 4:06 AM | Last Updated on Mon, Jan 7 2019 10:20 AM

Above 6 lakh crore corruption in last four and half years in state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలనలో సాగించిన అక్రమాల విలువ మొత్తం రూ.6.17 లక్షల కోట్లు దాటిపోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుండబద్దలు కొట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనంత దోపిడీ బాబు గత నాలుగున్నరేళ్ల ఏలుబడిలో సాగిందని ఎండగట్టింది. వివిధ రంగాల్లో సాగిన అక్రమాలను గణాంకాలతో వివరిస్తూ జీవోలు, నోట్‌ ఫైళ్లను కూడా ఆధారాలుగా చూపించింది. ఈ భాగోతాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ రూపొందించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని  ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా లక్కవరం క్రాస్‌ వద్ద పాదయాత్ర శిబిరంలో విడుదల చేశారు. వివిధ రంగాల్లో బాబు బ్యాచ్‌ సాగించిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ శోధించి వెలికితీసిన అంశాలతో రంగాల వారీగా ఈ పుస్తకాన్ని ప్రచురించింది. విశాఖపట్నం భూకుంభకోణంతో సహా రాష్ట్రంలో జరిగిన భూదందాలన్నీ పాలకుల కనుసన్నల్లోనే జరిగాయని ఎండగట్టింది.

విశాఖపట్నంలో లక్ష కోట్ల రూపాయల భూకుంభకోణంలో సూత్రధారులైన మంత్రులు, ఇతర కీలక నేతల పేర్లు బయటకు రాకుండా కప్పేసిన వైనాన్ని తప్పుబట్టింది. అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌ అంటూ ఎన్‌సీఏఈఆర్‌ సంస్థ వెల్లడించిన సర్వే నివేదికతోపాటు రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు) ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లం పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ప్రస్తావించింది. ఏపీలో చెత్త పాలన సాగుతోందంటూ జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ కంపెనీ ‘మాకి’ చైర్మన్‌ పుమిహికో ‘ఆర్కిటెక్చురల్‌ డైజెస్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూను ఇందులో ప్రచురించింది. అంతేకాక.. సాగునీటి శాఖలో లంచాలు, వాటాలు, కమీషన్లను ఎత్తిచూపింది. రాజధాని విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా వేల కోట్లు దోచుకున్నట్లు అందులో వివరించింది. వాటాల కోసం అత్యంత విలువైన భూములు పప్పుబెల్లాల్లా ధారాదత్తం చేసిన విషయాన్ని.. విపత్తులవల్ల నష్టపోయిన రైతులకు నిధులలేమి పేరుతో రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ, బకాయిలు ఎగవేసి కాగితాలకే పరిమితమైన పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పేరుతో కోట్లకొద్దీ నిధులు విడుదల చేయడాన్ని ఆ పుస్తకంలో పార్టీ ప్రస్తావించింది. అందులోని ముఖ్యాంశాలు..



1) ‘జలవనరు’ల్లో జలగలు 
జలవనరుల శాఖలో అంతులేని దోపిడీ సాగింది. గత నాలుగన్నరేళ్లలో ఈ శాఖలో రూ.1,01,422.42 కోట్లు అక్రమాలు సాగాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే పాత కాంట్రాక్టర్లను తొలగించారు. ధరలు తగ్గినా పనుల అంచనాలను భారీగా పెంచేశారు. కమీషన్లు ఇచ్చే అస్మదీయ సంస్థలకే పనులు కట్టబెట్టారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్‌ కృష్ణారావు, సత్యప్రకాష్‌ ఠక్కర్‌ వ్యతిరేకించినా వారిని ఖాతరు చేయకుండా ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేందుకు జీవో–22 జారీచేశారు. ఆ తర్వాత అదనపు చెల్లింపుల కోసం జీవో 63 జారీచేశారు. ఇలా గత నాలుగన్నరేళ్లలో రూ.62,132 కోట్లు ఖర్చుచేస్తే ఇందులో సగం రూ.32,000 కోట్లు కమీషన్ల రూపంలో కొట్టేశారు. మరోవైపు.. 23 ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం గత నాలుగన్నరేళ్లలో రూ.37,952.92 కోట్ల నుంచి రూ.96,060.78 కోట్లకు పెరిగింది. 

బినామీలకే పోల‘వరం’..
పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్‌ నాటికి పూర్తిచేస్తామని, ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా నీరందిస్తామని 2014 జూన్‌ 8న సీఎంగా ప్రమాణస్వీకారం సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. 2018 ఖరీఫ్‌ ముగిసినా ఈ ప్రాజెక్టు పనుల్లో సరైన పురోగతిలేదు. కానీ, దీని అంచనా వ్యయాన్ని మాత్రం రూ.16,010.45 కోట్ల నుంచి రూ. 57,940.86 కోట్లకు పెంచడం ద్వారా రూ.25 వేల కోట్ల దోపిడీకి స్కెచ్‌ వేశారు. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా సీఎం, మరో కీలకమంత్రి భారీ కమీషన్లు పొందారు. బాబు బినామీ అయిన సీఎం రమేష్‌ చెప్పిన మాట వేదవాక్కులా నడుస్తోంది.

2) అంతులేని భూకబ్జాలు
రాష్ట్రంలో భూకబ్జాలకు అడ్డూ అదుపూలేదు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే లక్ష కోట్ల రూపాయల భూకుంభకోణం జరిగింది. ఏకంగా లక్ష ఎకరాల భూ రికార్డులను మాయంచేసి ప్రభుత్వ పెద్దల పేర్లతో రాయించుకున్నారు. ఉదా..
– మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు భాస్కరరావు, ఇతరుల పేరుతో వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం కూడా తెచ్చుకున్నారు. పలు మండలాల్లో 533 ఎకరాల పేదల భూములను మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు కొట్టేశారు. 
– విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాలకలోని 955 ఎకరాల అసైన్డ్‌ భూములను కూడా నేతలు మింగేశారు. 
– 1,993 ఎకరాల వక్ఫ్‌ భూములను కూడా కైవసం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో మంత్రుల పాత్ర ఉందని సాక్షాత్తూ ఆ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడే ఆధారాలతో సహా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ పాత్ర ఉన్నందున ‘సిట్‌’ అంటూ మూసేశారు. 
– విశాఖ జిల్లా రుషికొండలో రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను సీఎం బంధువు ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబీకులు కబ్జా చేశారు. దేవదాయ, ఈనాం, వక్ఫ్‌ భూములనూ మింగేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు. 

3) వాటాల కోసం అస్మదీయులకు ధారాదత్తం
పరిశ్రమలు ఏర్పాటుచేయకపోయినా అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాల మాదిరిగా కట్టబెట్టి సీఎం చంద్రబాబు వాటాలు పొందుతున్నారు. అందుకు ఉదాహరణలు..
– విశాఖలో రూ.400 కోట్ల విలువైన 25 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు రూ.13 కోట్లకే ధారాదత్తం చేశారు. 
– ఇదే జిల్లాలో ఫైవ్‌స్టార్‌ హోటల్, షాపింగ్‌ మాల్‌ కోసమంటూ రూ.905 కోట్ల విలువైన 12.52 ఎకరాల స్థలాన్ని నామమాత్రపు లీజుకు కట్టబెట్టారు. 
– కృష్ణాజిల్లా గన్నవరంలో రూ.250 కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని హెచ్‌సీఎల్‌కు సంతర్పణ చేశారు. 
– మంత్రి లోకేష్‌ మిత్రుడికి చెందిన ఈ–సెంట్రిక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.338 కోట్ల విలువైన భూమిని రూ.25 కోట్లకే కట్టబెట్టారు. – విశాఖ జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను లాక్కుని సీఎం సమీప బంధువు ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబానికి చెందిన ‘గీతం’ యూనివర్సిటీకి, కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రూ.498 కోట్ల విలువైన భూములను 4.98 కోట్లకే ఇదే కుటుంబానికి చెందిన విశాఖపట్నం బాట్లింగ్‌ కంపెనీ (వీబీసీ) కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ కంపెనీకి, తిరుపతిలో ‘గల్లా’కు చెందిన మంగల్‌ ఇండస్ట్రీస్‌కు కారుచౌకగా భూములు కట్టబెట్టారు. తూర్పు గోదావరి, వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్టీఆర్‌ ట్రస్టుకు రూ.133.5 కోట్ల విలువైన భూములను కేటాయించారు.

4) రాజధాని కుంభకోణం
రాజధాని అమరావతిని చంద్రబాబు అంతర్జాతీయ కుంభకోణంగా మార్చేశారు. రాజధానికి 5 వేల ఎకరాలు చాలని నిపుణులు చెబుతున్నప్పటికీ 34 వేల ఎకరాలు సమీకరించారు. ప్రభుత్వ భూమి దీనికి అదనం. ఇక్కడ ఎకరా రూ.4 కోట్లు విలువైన స్థలాలను అస్మదీయులకు రూ.50 లక్షలు.. కొందరికి ఇంకా తక్కువకే కేటాయించారు.  


5) అస్మదీయులకు రూ.లక్ష కోట్లు
అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటుపై లీకులతో బాబు బినామీలు, అస్మదీయులు ఆ ప్రాంతంలో 25 వేల ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. అనంతరం రాజధాని అక్కడే ఏర్పాటుకావడంతో లక్ష కోట్ల వరకూ లబ్ధిపొందారు. అసైన్డ్‌ భూముల రైతుల్లోనూ భయాందోళన రేకెత్తించి చౌకగా వాటిని కొనుగోలు చేశారు. మంత్రులు నారాయణ, లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మాగంటి మురళీమోహన్, స్పీకర్‌ కోడెల తనయుడు కోడెల శివరామకృష్ణ, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రచౌదరి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తోపాటు బాబు బినామీలెందరో ఇక్కడ ముందుగానే భూములు కొన్నారు. మంత్రి నారాయణ రూ.14,400 కోట్ల విలువైన 3,129 ఎకరాలను రూ.432 కోట్లకే కొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు రూ.784 కోట్ల విలువైన 196 ఎకరాలను రూ.39 కోట్లకే కొనుగోలు చేశారు. 

6) స్విచ్‌ ఛాలెంజ్‌ ఓ దోపిడీ పథకం
స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగించేందుకు అనుసరించిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానం మొత్తం దోపిడీ పథకమే. ఈ నోటిఫికేషన్‌ను కోర్టు కూడా తప్పుబట్టడంతో దానిని రద్దుచేసి మరో నోటిషికేషన్‌ జారీచేశారు. గ్లోబల్‌ టెండర్లు పిలవకుండా స్విçస్‌ ఛాలెంజ్‌ పేరుతో సింగపూర్‌ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పనులను కట్టబెట్టారు. ఖజానాకు రూ.6,623 కోట్ల నష్టం కలిగించే ఈ ప్రాజెక్టు కుంభకోణం ఖరీదు రూ.66,000 కోట్లు.

7) రూ.35,000కోట్ల అగ్రిగోల్డ్‌ కుంభకోణం
40 లక్షల మంది డిపాజిటర్లు, ఏజెంట్లను ముంచి అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేసేందుకు చంద్రబాబు పక్కా స్కెచ్‌ వేశారు. పేదల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్, ఇతర ఆస్తులను హైకోర్టు వేలంవేసి ఆ మొత్తాన్ని డిపాజిటర్లకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఈ ఆస్తులను కొనేందుకు ముందుకు వచ్చిన ఎస్సెల్‌ గ్రూపు సంస్థ ప్రతినిధులను ఢిల్లీలో అర్ధరాత్రి కలిసిన బాబు వారిని వెనక్కు వెళ్లేలా చేశారు.

8) నీరు–చెట్టుతో రూ.34,399 కోట్లు..
రాష్ట్రంలో నీరు–చెట్టు ద్వారా అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.12,866 కోట్ల బిల్లులు చెల్లించారు. వారు చేసిన పనుల విలువ మాత్రం రూ. 3,216.5 కోట్లు అయితే.. దోచుకున్న మొత్తం రూ.9,649.5 కోట్లు. కుంటలు, వాగుల్లో తవ్విన పూడిక మట్టి, ఇసుక అమ్మకం ద్వారా మింగిన మొత్తం రూ.24,750 కోట్లు. ఈ పథకం ద్వారా టీడీపీ నేతల మేత మొత్తం రూ.34,399 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్‌ కొనుగోలులో మరో 21,000 కోట్లు మింగేశారు. పవన విద్యుత్‌ పేరుతో రూ.11,625 కోట్లు దండుకున్నారు.


9) ఆక్టోపస్‌లా విస్తరించిన అవినీతి
రాష్ట్రంలో గత నాలుగన్నరేళ్లలో చంద్రబాబు అండ్‌ కో అవినీతి ఆకాశమే హద్దుగా సాగుతోంది. కమీషన్లు, ముడుపులు, వాటాలు, దందాల ద్వారా ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలదే ఇష్టారాజ్యంగా మారింది. ఉచితం పేరుతో ఇసుక దోపిడీకి తెరలేపారు. రాజధాని ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ ద్వారా దోచుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ అస్మదీయ సంస్థలకే అప్పగించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంపు ద్వారా నేరుగా సీఎం చంద్రబాబుకే ముడుపులు అందుతున్నాయి. అసెంబ్లీని ఎమ్మెల్యేల ఆక్షన్‌ హాల్‌గా మార్చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయినా, స్పీకరు వారిపై అనర్హత వేటు వేయకుండా అసెంబ్లీ వ్యవస్థను అపహాస్యం చేశారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ములో కొంత మొత్తాన్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా పంపించారు.
– మాజీ సీఎస్‌ అజేయ కల్లం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement