సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా, రైతులకు తిప్పలు తప్పడం లేదు. వర్షాలకు మురిసిపోయి ఆయకట్టేతర ప్రాంతాల్లో మెట్ట పంటలు సాగుచేసిన రైతులకు మళ్లీ నష్టాలు తప్పేలా లేవు. భూగర్భజలాలు పెరగకపోవడం, వర్షానికీ వర్షానికి మధ్య ఎక్కువ రోజుల తేడా ఉండడంతో మెట్ట పంటలు ఎండుముఖం పట్టాయి.
‘‘ఈ దశలో వర్షాలు లేకున్నా.. మెట్టపంటలకు పెద్దగా సమస్య ఏమీ ఉండ దు’’ అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా రైతుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. గిరిజన తండాల్లో తాగునీటి సమస్య అప్పుడే మొదలైంది. ప్రధానంగా భువనగిరి డివిజన్‌లో పరిస్థితి కొంత సమస్యాత్మకంగానే కనిపిస్తోంది. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని మూసీ ఆయకట్టేతర గ్రామాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాధారంతో నిండాల్సిన భువనగిరి, బీబీనగర్, అనాజీపురం, రాయగిరి చెరువులతో పాటు కుంటలు కూడా నిండలేదు. వాగులు పారలేదు. దీంతో భూగర్భజలాలు పెరగలేదు. బీబీనగర్, వలిగొండ, భువనగిరి మండలాల్లో వర్షాధారంపై సాగు చేసిన పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు ఎండుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదైంది. కానీ, మెట్ట పంటలను కాపాడుకునే స్థాయిలో సరిపోను వర్షాలు పడలేదు. ఆలేరు నియోజకవర్గంలో కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఏ గ్రామంలోనూ చెరువులు, కుంటలు నిండలేదు. ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరలేదు. ప్రధానమైన ఆలేరు వాగు ఒక్కసారీ పారలేదు.
అడపాదడపా కురిసన వర్షాలకు సీజన్ ప్రారంభంలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న, కంది, వరి, పత్తి, పంటలకు సరిపోను నీరందడం లేదు. ప్రస్తుతం రాజాపేట మండ లం జాల, నర్సాపురం, రాజాపేటలో మొక్కజొన్న తీవ్రం గా ఎండిపోతోంది. ఎలాంటి సాగునీటి సౌకర్యమూ లేని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో వర్షాలు లేక సుమారు 50వేల ఎకరాల్లో పత్తిపంట నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉండడంతో మందులు విరివిగా పిచికారీ చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో చేను ఆరుబడుతోంది. కాత, పూత కూడా రాలిపోతోంది. జొన్న, కంది, ఆముదం చేలు కూడా ఆరుబడుతున్నాయి. వర్షాలు సరిపడా కురవక చౌటుప్పల్ మండలంలో భూగర్భజలాలు ఏమాత్రం పెరగలేదు. చౌటుప్పల్, కొయ్యలగూడెం, ఎల్లగిరి, మసీదుగూడెం, చిన్నకొండూరు గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది.
ట్యాంకర్లతో ఇంకా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. చౌటుప్పల్‌లో 2011 మే నుంచి ట్యాంకర్లతోనే తాగునీటిని సరఫరా చేస్తున్నారంటే భూగర్భజలాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి ట్యాంకర్లను నిలిపివేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఆదేశాలిచ్చారు. కానీ, పరిస్థితి కొంత విషమంగానే ఉండడంతో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయక తప్పడం లేదు. వేములపల్లి మండల పరిధిలోని గుర్రప్పగూడెం, ఆగామోత్కూర్ గ్రామాల్లో వేరుశనగ పంట ఎండిపోతోంది. సూర్యాపేట మండలంలో మూసీ పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ మూసీ ప్రాజెక్టు నుంచి ఎడమకాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో బోరుబావులపై ఆధార పడి రైతులు వరిని సాగుచేశారు.
మరో వైపు వర్షాలు సరిపోను కురవక, భూగర్భ జలమట్టం పడిపోయి ఇమాంపేట గ్రామ ఆవాసం జాటోత్‌తండా, బోజ్యతండా, రామారం ఆవాసం అచ్యతండాలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చివ్వెంల మండలంలోనూ వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టాయి. దీనికి తోడు విద్యుత్ సరఫరా కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో వరిపొలాలు నెర్రెలు బారా యి. తాగునీటికి మండల పరిధిలోని వాల్యాతండా, రోళ్లబండతండా, చందుపట్ల, తుల్జారావుపేట, ఐలాపురం, గాయంవారిగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో వర్షాభావ పరిస్థితులు, కరెంటు సమస్యలతో దాదాపు 100 హెక్టార్లలో వరి పొలాలు బీటలు వారాయి. అదేవిధంగా పూత, కాయ దశలో ఉన్న పత్తి వర్షాభావ పరిస్థితులతో పూత రాలిపోతుంది.
మెట్ట.. బతుకుడెట్ట
Published Thu, Sep 5 2013 5:49 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement