ఏసీల వినియోగంపై చర్యలేవీ..?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఎయిర్ కండిషన్ల(ఏసీ) వినియోగాన్ని నియంత్రించేందుకు ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏసీల వినియోగం సాగుతోందని, హోదాలతో సంబంధం లేకుండా ప్రతి అధికారీ ఏసీలను వాడుతున్నారని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఫోరం ఫర్ బెటర్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డి.పద్మజ హైకోర్టులో 2013లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఏసీల వినియోగం విషయంలో 1980లో జారీ అయిన జీవోను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ పద్మజ మరోసారి కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఈ జీవో అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్లు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అసలు ఈ అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి, జీవోను అమలు చేస్తామని, అందుకు కొంత గడువు కావాలని ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ కోరారు. వీరి అభ్యర్థనకు అంగీకరించిన ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.