Air conditioning
-
ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా? జాగ్రత్త.. ఇవి తెలుసుకోవాల్సిందే
ఈమధ్య కాలంలో ఏసీల వినియోగం బాగా పెరిగింది.ఇల్లు, ఆఫీస్,ప్రయాణాల్లోనూ ఏసీలో ఉండటానికే ఇష్టపడతాం.కాస్త వేడిగా అనిపిస్తే చాలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అలా ఏసీల వినియోగం ప్రస్తుతం వ్యసనంగా మారిపోయింది. కానీ ఈ ఎయిర్ కండీషనర్ శరీరాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో తెలుసా? రోజులో ఎక్కుసేపు ఏసీలో ఉంటే ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ వచ్చే ప్రమాదం ఉంది. ఏసీ వినియోగం మితిమీరితే శరీరంపై కలిగే దుష్ప్రభావాలు ఏంటన్నది ఈ స్టోరీలో చదివేయండి. ► ఏసీలు వేయగానే డోర్లు మూసేస్తాం. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు. దీంతో ఆక్సిజన్ తక్కువ అయి తలనొప్పి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్‌కు కూడా దారితీస్తుంది. ► ఏసీ వల్ల రక్తంలో ఆక్సిజన్ తక్కువై శరీరం త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వస్తుంది. ► ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది.దీని కారణంగా, చర్మం పగుళ్లు ఏర్పడి పొడిగా మారుతుంది. ► ఎక్కువగా ఏసీలో ఉండే వ్యక్తులు తలనొప్పి వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటారు. ► ఏసీ చల్లదనం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతాం. ఏసీలో ఉండటం వల్ల ఎక్కువ శాతం నీరు తాగాలనిపించదు. ఇది కిడ్నీ సమస్యకు కూడా దారితీయొచ్చు. ► ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు ఏసీలకు దూరంగా ఉండటమే మంచిదే. ► ఎక్కువ సేపు ఏసీలో గడిపేవారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గొంతు పొడిబారడం, రినిటిస్ వంటి సమస్యలతో ఇబ్బందిపడతారు. ► ఏసీల వల్ల మరో సమస్య ఎలుకలు సెంట్రల్ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి. ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. నెలకోసారి అయినా ఏసీలను క్లీన్ చేయాలి. అందుకే ఎక్కువ సేపు బయటి వాతావరణం పై ఆధారపడాలి. కిటికీలు, డోర్లు తెరిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండాలి. -
ఏసీ లేకుండా ప్రయాణం ఎలా?
గూడూరు: ఏసీ బోగీలో ఏసీ పని చేయడం లేదని చెప్పినా రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మరమ్మతులు చేసే వరకు రైలును కదలనివ్వబోమంటూ ఏసీ బోగీ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఏసీ లేని కారణంగా చార్జీలు రీఫండ్ చేయాలంటూ భీష్మించుకూర్చున్నారు. దీంతో కేరళా రాష్ట్రం కొల్లాం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రత్యేక రైలు గంటపైగా గూడూరు జంక్షన్లో నిలిచిపోయింది. ప్రయాణికుల సమాచారం మేరకు.. కొల్లాం నుంచి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు బయలుదేరింది. ఈ రైల్లో ఏ–1 ఏసీ కోచ్‌లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కొల్లాంలో రైలు బయలు దేరినప్పటి నుంచి ఆ కోచ్‌లో ఏసీ పనిచేయడం లేదు. దీంతో మార్గమధ్యంలో కోయబత్తూరు, కాట్పాడ్, రేణిగుంట తదితర రైల్వేస్టేషన్‌ల్లో ఆగిన చోటల్లా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఏసీ పనిచేయక, గ్లాస్లన్నీ మూసేసి ఉండటంతో గాలిలేక ప్రయాణికులు అల్లాడిపోయారు. గూడూరు రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 2.15 గంటలకు రావాల్సిన ఈ రైలు 3 గంటల ఆలస్యంగా సాయంత్రం 5.15 గంటలకు చేరుకుంది. అప్పటికే అసహనానికి గురైన ప్రయాణికులు ఏసీ పనిచేసే వరకూ ఈ రైలును పోనివ్వమంటూ రైలును కదలనివ్వకుండా ఆపేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్టేషన్ మాస్టర్ గంగాధర్ తిలగం, రైల్వే ఎస్సై గిరయ్య ప్రయాణికులకు ఎంత సర్దిచెప్పినా ససేమిరా అన్నారు. తాము కొల్లాం నుంచి విశాఖపట్నంకు తత్కాల్లో రూ.2,450 చెల్లించామని, బయలుదేరిన దగ్గర నుంచి ఏసీ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, సాధారణ చార్జీలు తీసుకుని తిరిగి రూ.1800 ఇవ్వాలని లేదంటే, ఏసీ రిపేరు చేయించాకే రైలు పంపాలని తేల్చి చెప్పారు. దీంతో స్టేషన్ మాస్టర్, రైల్వే ఎస్సై ఇక్కడ మెకానిక్ లేరని, విజయవాడ నుంచి రావాలన్నా సుమారు 4 గంటలు పడుతుందని, ఈలోగా మీరే అక్కడికి వెళ్లొచ్చని, అక్కడ మరమ్మతులు చేయిస్తారని ప్రయాణికులకు సర్దిచెప్పారు. అక్కడి వరకు ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు కోచ్‌లో ఉన్న ఎగ్జిట్ గ్లాస్‌లను తొలగించారు. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా రైల్లో విజయవాడ వరకూ పంపారు. దీంతో రైలు గంట ఆలస్యంగా 6.15 గంటలకు గూడూరు నుంచి బయలుదేంది. -
ఏసీల వినియోగంపై చర్యలేవీ..?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఎయిర్ కండిషన్ల(ఏసీ) వినియోగాన్ని నియంత్రించేందుకు ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏసీల వినియోగం సాగుతోందని, హోదాలతో సంబంధం లేకుండా ప్రతి అధికారీ ఏసీలను వాడుతున్నారని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఫోరం ఫర్ బెటర్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డి.పద్మజ హైకోర్టులో 2013లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ఏసీల వినియోగం విషయంలో 1980లో జారీ అయిన జీవోను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ పద్మజ మరోసారి కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ జీవో అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్లు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అసలు ఈ అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి, జీవోను అమలు చేస్తామని, అందుకు కొంత గడువు కావాలని ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ కోరారు. వీరి అభ్యర్థనకు అంగీకరించిన ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.