గూడూరు: ఏసీ బోగీలో ఏసీ పని చేయడం లేదని చెప్పినా రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మరమ్మతులు చేసే వరకు రైలును కదలనివ్వబోమంటూ ఏసీ బోగీ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఏసీ లేని కారణంగా చార్జీలు రీఫండ్ చేయాలంటూ భీష్మించుకూర్చున్నారు. దీంతో కేరళా రాష్ట్రం కొల్లాం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రత్యేక రైలు గంటపైగా గూడూరు జంక్షన్‌లో నిలిచిపోయింది. ప్రయాణికుల సమాచారం మేరకు.. కొల్లాం నుంచి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు బయలుదేరింది. ఈ రైల్లో ఏ–1 ఏసీ కోచ్‌లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కొల్లాంలో రైలు బయలు దేరినప్పటి నుంచి ఆ కోచ్‌లో ఏసీ పనిచేయడం లేదు. దీంతో మార్గమధ్యంలో కోయబత్తూరు, కాట్పాడ్, రేణిగుంట తదితర రైల్వేస్టేషన్‌ల్లో ఆగిన చోటల్లా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఏసీ పనిచేయక, గ్లాస్‌లన్నీ మూసేసి ఉండటంతో గాలిలేక ప్రయాణికులు అల్లాడిపోయారు.
గూడూరు రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 2.15 గంటలకు రావాల్సిన ఈ రైలు 3 గంటల ఆలస్యంగా సాయంత్రం 5.15 గంటలకు చేరుకుంది. అప్పటికే అసహనానికి గురైన ప్రయాణికులు ఏసీ పనిచేసే వరకూ ఈ రైలును పోనివ్వమంటూ రైలును కదలనివ్వకుండా ఆపేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్టేషన్ మాస్టర్ గంగాధర్ తిలగం, రైల్వే ఎస్సై గిరయ్య ప్రయాణికులకు ఎంత సర్దిచెప్పినా ససేమిరా అన్నారు. తాము కొల్లాం నుంచి విశాఖపట్నంకు తత్కాల్‌లో రూ.2,450 చెల్లించామని, బయలుదేరిన దగ్గర నుంచి ఏసీ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, సాధారణ చార్జీలు తీసుకుని తిరిగి రూ.1800 ఇవ్వాలని లేదంటే, ఏసీ రిపేరు చేయించాకే రైలు పంపాలని తేల్చి చెప్పారు. దీంతో స్టేషన్ మాస్టర్, రైల్వే ఎస్సై ఇక్కడ మెకానిక్ లేరని, విజయవాడ నుంచి రావాలన్నా సుమారు 4 గంటలు పడుతుందని, ఈలోగా మీరే అక్కడికి వెళ్లొచ్చని, అక్కడ మరమ్మతులు చేయిస్తారని ప్రయాణికులకు సర్దిచెప్పారు. అక్కడి వరకు ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు కోచ్‌లో ఉన్న ఎగ్జిట్ గ్లాస్‌లను తొలగించారు. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా రైల్లో విజయవాడ వరకూ పంపారు. దీంతో రైలు గంట ఆలస్యంగా 6.15 గంటలకు గూడూరు నుంచి బయలుదేంది.
Comments
Please login to add a commentAdd a comment