
ఏసీబీ వలలో అవినీతి చేపలు
చీపురుపల్లి : అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ర్యాలీలు, సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించగా, మరో పక్క లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు. వేధింపులు, కేసులు లేకుండా ఉండాలంటే తమకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి, చీపురుపల్లి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో గల మెరకముడిదాం మండలం భైరిపురంలో ఉన్న మద్యం దుకాణం యజమాని కె.సత్యం నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.నాగభూషణరావు, కానిస్టేబుల్ జగన్నాథరెడ్డి దొరికిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి అందజేసిన వివరాలు...
భైరిపురంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న సత్యంను ఎక్సైజ్ అధికారులు నిత్యం వేధిస్తున్నారు. భవిష్యత్తులో వేధింపులు, కేసులు లేకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన తమను ఆశ్రయించినట్లు చెప్పారు. తమ సూచన మేరకు గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో సత్యం రూ. 15 వేలు తీసుకుని సీఐ నాగభూషణరావు గదిలోకి వెళ్లి, ఆయనకు ఇవ్వగా, ఆ సొమ్మును సీఐ ఆదేశాలు మేరకు పక్కన ఉన్న కానిస్టేబుల్ జగన్నాథరెడ్డి అందుకున్నారు. అదే సమయంలో దాడిచేసి వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు లక్ష్మీపతి తెలిపారు.
నిత్యం వేధింపులే....
ఇదే విషయమై భైరిపురం మద్యం దుకాణం యజమాని కొప్పల సత్యం విలేకరులతో మాట్లాడుతూ తమ దుకాణంపై ఎక్సైజ్ అధికారులు నిత్యం దాడులుచేస్తూ, తనను వేధింపులకు గురిచేసేవారని చెప్పారు. చాలా ప్రాంతాల్లో సారా తయారవుతోందని సమాచారం ఇచ్చినా కనీసం పట్టించుకోలేదని చెప్పారు. వ్యాపారం నష్టాల్లో సాగుతూ అవస్థలు పడుతుంటే ... తమ దుకాణంపై ఏదో ఒక కేసు బనాయిస్తూనే ఉన్నారని తెలిపారు. ఇటీవల తమ దుకాణం నుంచి బిల్లుతో కూడిన మద్యం బాటిళ్లను ఓ ఆటోలో తీసుకెళ్తుండగా వాటిని పట్టుకుని రూ.45 వేలు లంచం డిమాండ్ చేశారని చెప్పారు. బిల్లులు ఇచ్చామని అయినప్పటికీ కేసులు ఎందుకని ప్రశ్నించగా, ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావని హెచ్చరించారన్నారు. తరువాత అయితే రూ. 45 వేల నుంచి 15 వేల రూపాయలకు దిగారని, వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పారు.
ఉద్యోగ విరమణ వాయిదా పడి....
సీఐ నాగభూషణరావు 2014 ఆగస్టు నెలలో ఉద్యోగ వి రమణ పొందాల్సి ఉంది. అలా జరిగితే ఆయన ఏసీబీ అధికారులకు చిక్కేవారు కాదు. అయితే ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచడంతో ఆయన విధుల్లో కొనసాగుతూ ఇలా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.