వెలగపూడిలో ఏసీబీ తొలిదాడి
సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తొలిసారిగా దాడి చేసింది. హోం శాఖ సెక్షన్ అధికారి కె.శ్రీనాథ్ శుక్రవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.గుజరాత్‌తో పాటు సుమారు ఏడు రాష్ట్రాల్లో సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్వహిస్తున్న సంస్థ ఏపీలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇవ్వాలి. ఇందుకు తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని సెక్షన్ అధికారి శ్రీనాథ్ వేధిస్తున్నాడంటూ శివ ఏజెన్సీస్ ప్రతినిధి ఎస్.గంగూలీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు, విజయవాడ ఏసీబీ డీఎస్పీలు దేవానంద్ శాంతో, వాసంశెట్టి గోపాలకృష్ణ సిబ్బందితో కలసి శుక్రవారం దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.