సిద్దిపేట, న్యూస్‌లైన్:
సిద్దిపేటపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కన్నేసింది. గడిచిన గురువారం, అంతకుముందు రోజు అధికారులు ఇక్కడికొచ్చి చక్కర్లు కొట్టారు. శనివారం కూడా వారు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. మూడు రోజుల కిందట మాత్రం ఏసీబీ అధికారుల వచ్చినట్టు ‘న్యూస్‌లైన్’కు విశ్వసనీయంగా తెలిసింది. వాళ్లు అంత సీరియస్‌గా సిద్దిపేటపై దృష్టి కేంద్రీకరించడం చర్చనీయాంశమైంది. ఈ డివిజన్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వందకుపైగానే ఉన్నాయి. ప్రధానమైన శాఖలపై ఏసీబీ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా శాఖల్లో అధికారులు, సిబ్బంది ఉత్కంఠకు లోనవుతున్నారు.
తీక్షణంగా పరిశీలన
ఏసీబీ అధికారి తన బృందంతో ఇటీవల స్థానిక టౌన్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు(ఎస్‌ఆర్‌ఓ) వద్దకు వచ్చినట్టు సమాచారం. ఏసీబీ ఉద్యోగి ఒకరు ఎస్‌ఆర్‌ఓలోని కంప్యూటర్ క్యాబిన్‌కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఏసీబీ టార్గెట్ అయిన ఒకరిద్దరు ఉద్యోగుల ఆస్తుల చిట్టాను వెలికితీశారని తెలుస్తోంది. గంటకుపైగానే కంప్యూటర్ పరిశీలించినట్టు సమాచారం. ‘చూడబోతే... చిన్న ఉద్యోగేనంట... ఆస్తులు మాత్రం కళ్లు తిరిగేలా కూడబెట్టాడంట. అందుకే ఏకకాలంలో భరతం పట్టేందుకు... ఏసీబీ సమాయాత్తమవుతోంది’ అని భావిస్తున్నారు.
ఓ సారు... ముగ్గురు సహాయకులు..
ఏసీబీ ఎవరిపై గురి పెట్టిందో నిర్దిషంగా వెల్లడి కాకపోయినప్పటికీ ఇద్దరు ముగ్గురు ఉద్యోగుల గురించి చర్చ జరుగుతోంది. ఓ ముఖ్యమైన శాఖలో ఆఫీసర్ తనకు నమ్మదగిన ముగ్గురు కింది స్థాయి అధికారుల ద్వారా రెండు చేతులా అడ్డగోలుగా ఆర్జిస్తున్నారని ప్రచారంలోకి వస్తోంది. అదే అదనుగా ఆ సారు ఇచ్చిన స్వేచ్ఛతో సదరు సహాయకులు మరింత రెచ్చిపోతున్నారని అంటున్నారు. కొన్ని నెలల కిందట అట్టహాసంగా తలపెట్టిన ఓ కార్యక్రమానికి ముందు కూడా ‘విశేష సేవలు’ పేరిట పెద్ద ఎత్తున దండుకున్నారనేది కూడా నెమ్మదిగా తెరకెక్కుతోంది. మొత్తానికీ ఏసీబీ కసరత్తులో ఎవరి పాపం పండుతుందో చూడాలి..!
సిద్దిపేటపై ఏసీబీ కన్ను
Published Sun, Sep 8 2013 3:34 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement