![ACB attacks on Siddipet ASP home - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/19/aaaa.jpg.webp?itok=s7gMGb6Z)
ఏఎస్‌పీ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సిద్దిపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవిందు నర్సింహారెడ్డి నివాసంపై, ఆయన స్వగ్రామం, అనుచరులు, అనుమానితులపై బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భూ పత్రాలు, బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సిద్దిపేటలో ఉన్న ఇంటితోపాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
బుధవారం తెల్లవారుజామున సిద్దిపేట సీపీ కార్యాలయంలోని ఏఎస్‌పీ చాంబర్‌తోపాటు ఆయన నివాసంలోను సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి భార్య అఖిలారెడ్డి పేరుపై ఉన్న 4 ఎకరాలతోపాటు వేరే వారి పేర్లపై ఉన్న మరో నాలుగెకరాల భూ పత్రాలతోపాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ల్లో ఉన్న వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలతోపాటు, ఇతర ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
వీటి విలువ సుమారుగా రూ.30 కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. నర్సింహారెడ్డితో సన్నిహితంగా ఉండే వన్‌టౌన్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా సోదాలు చేసేందుకు వెళ్లగా ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుతిరిగారు. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment