సాక్షి, అమరావతి: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ)లో జరిగిన భారీ కుంభకోణంలో మూలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టిపెట్టింది. చంద్రబాబు జమానాలో జరిగిన ఈ స్కామ్‌పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదికతో ఏసీబీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐలో 2014 నుంచి 2019 వరకు నిబంధనలకు విరుద్ధంగా రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ సర్వీసెస్ సేవల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని నిగ్గుతేల్చింది. ఇందుకు ప్రతిగా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, ఈ బాగోతంలో 19 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేష్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టుచేసింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో మిగిలిన వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధంచేసుకుంటున్న ఏసీబీ.. మరింత లోతైన దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలతోపాటు సెర్చ్ టీమ్‌లను రంగంలోకి దించింది.
► స్కామ్‌తో ప్రమేయమున్న 19 మంది కాల్‌లిస్ట్‌ను సేకరించి లోతైన దర్యాప్తు చేయడం ద్వారా వారితో ఇంకెవరికి సంబంధాలు ఉన్నాయో ఈ బృందాలు గుర్తించనున్నాయి.
► సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో శాఖాపరమైన జీఓలను పరిశీలించలేదనే ప్రధాన అంశానికి సంబంధించి వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం.
బ్యాంకు లావాదేవీలపైనా ఆరా..
► స్కామ్‌లో ప్రమేయమున్న వ్యక్తులు, అక్రమాలకు పాల్పడిన సంస్థలు, కంపెనీలకు చెందిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
► 2016లో అచ్చెన్నాయుడు లేఖ రాసిన అనంతరం.. ఈఎస్‌ఐ స్కామ్‌కు తెరలేపడంతో ఆయా వ్యక్తులు, సంస్థలు, కంపెనీల బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు ఎప్పుడు జరిగాయి.. ఎలా జరిగాయి.. ఎవరు చేశారు అనే కోణాలపైనా దృష్టిపెట్టారు.
► దీనిలో భాగంగానే ఆయా వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లను తొలుత స్తంభింపజేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
► అంతేకాక.. మందులు, పరికరాల కొనుగోళ్లు, సేవలకు సంబంధించిన సంస్థలు, కంపెనీల పుట్టుపూర్వోత్తరాలపైనా ఏసీబీ అధికారులు గురిపెట్టారు.
► ఈఎస్‌ఐతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రుడ్జీ కంప్యూటర్స్ అండ్ ల్యాప్‌టాప్స్, జలమ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్, జర్కిస్ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌కేపీ ఎంటర్‌ప్రైజెస్ (విజయనగరం), శ్రీ సీతారామ ఫార్మాస్యూటికల్స్ (నరసరావుపేట) తదితర కంపెనీలు, సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి. వాటి గుర్తింపు, సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత తదితర అన్ని కోణాల్లోను ఏసీబీ దర్యాప్తు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment