ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఖమ్మం కార్పొరేషన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.శామ్యూల్ ఆస్తియాజమాన్యంపై పేరుమార్పిడి చేసేందుకు ఎనిమిదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు...
ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీకి చెందిన చింతల సుగుణ అనే మహిళ ఎడవల్లి ద్రౌపది వద్ద ఐదు నెలల క్రితం ఇంటిని కొనుగోలు చేసింది. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పేరు మార్పిడి కోసం సుగుణ తన తమ్ముడు హనుమంతరావుతో కలిసి కార్పొరేషన్ ఖానాపురం డివిజన్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ జూనియర్ అసిస్టెంట్ శామ్యూల్‌కు ఇంటిని తమ పేర మార్చాలని దరఖాస్తు సమర్పించింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా పని మాత్రం జరగడం లేదు. దీంతో విసిగి వేసారిన సుగుణ తమ పని ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించింది. పేరు మార్చాలంటే ఖర్చు అవుతుందంటూ శామ్యూల్ అసలు విషయం బయట పెట్టాడు. ఎంత కావాలని అడగగా కార్పొరేషన్ చలానాకు రూ.3వేలు, అదనంగా రూ.10వేలు ఇస్తే పని పూర్తి చేసి పెడతానని హామీ ఇచ్చాడు. తాము అంత డబ్బు ఇవ్వలేమని చెప్పగా డబ్బులు ఉంటేనే రావాలని, లేదంటే బయటకు వెళ్లండంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో చేసేది లేక ఇల్లు కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ద్వారా బేరం కుదిర్చారు. రూ.8వేలు లంచం ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపారు.
వీరి సలహా మేరకు పౌడర్ చల్లిన ఎనిమిది వెయ్యి రూపాయల నోట్లను సుగుణ తమ్ముడు హనుమంతరావుతో శుక్రవారం డివిజన్ కార్యాలయానికి పంపించారు. డబ్బులు తీసుకున్న శామ్యూల్ వాటిని లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శామ్యూల్‌ను కార్యాలయంలో దాదాపు రెండు గంటలపాటు విచారించారు. రూ.8వేలతోపాటు ఆయన వద్ద ఉన్న మరో రూ.38వేలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి లంచం పూర్వకంగా వచ్చినవా... కార్యాలయానికి సంబంధించినవా అనేది విచారణ చేస్తున్నారు. శామ్యూల్‌ను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వెంకటేశ్వరరావు, బాబురెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు.
నాలుగు నెలలుగా తిప్పుతున్నారు..
కె. హన్మంతు, బాధితుడు..
పేరు మార్చడానికి రేపు..మాపు అంటూ 4 నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. చివరికి పని పూర్తి కావాలంటే ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జిరాక్స్ పత్రాలతో పాటు చలానాకు రూ.3 వేలు, మామూళ్లు కింద రూ.10 వేలు ఖర్చు అవుతుందని జూనియర్ అసిస్టెంట్ తెలిపాడు. అంతా ఇచ్చుకోలేమని ప్రాధేయ పడినా వినలేదు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాం.
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
Published Sat, Sep 21 2013 4:04 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement