ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ రాజేష్ (ఫైల్)
కర్నూలు(అగ్రికల్చర్): ఆయన కేవలం జూనియర్ అసిస్టెంట్. ఉద్యోగంలో చేరి పదేళ్లు మాత్రమే అయ్యింది. ఈ వ్యవధిలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో పది రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన సాగించిన అక్రమాలు ఒక్కసారిగా వెలుగు చూడటంతో అధికారులు అవాక్కయ్యారు. ఏకంగా రూ.28.65 లక్షలు భార్య పేరుతో ఏర్పాటు చేసిన బోగస్ ఏజెన్సీలకు మళ్లించుకున్నారు.
కర్నూలులోని అపూర్వ సరోవర్‌లో ఆస్తులు కూడా కొన్నారు. మొత్తమ్మీద వ్యవసాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ జి.రాజేష్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధుల స్వాహాపై కలెక్టర్ ఆదేశాల మేరకు జేడీఏ ఠాగూర్‌నాయక్ కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెనువెంటనే పోలీసులు రాజేష్‌ను, ఆయన భార్య స్వాతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అధికారుల బాధ్యతారాహిత్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై జేడీఏ విచారణకు ఆదేశించారు.
‘కారుణ్యం’ చూపితే..కన్నం వేశాడు!
నందికొట్కూరు పట్టణానికి చెందిన సాయి వెంకటరమణ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించారు. దీంతో ఆయన కుమారుడు రాజేష్‌కు కారుణ్య నియామకం కింద వ్యవసాయ శాఖలో ఉద్యోగం వచ్చింది. 2008 జూలై 1న నందికొట్కూరు ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా చేరారు. అక్కడి నుంచి బదిలీపై 2013 మే 21న కర్నూలు జేడీఏ కార్యాలయానికి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే అభియోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 8న ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆయన నెలసరి వేతనం రూ.35,903 మాత్రమే. కానీ రూ.1.40 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది.
జేడీఏ కార్యాలయానికి బదిలీ అయినప్పటి నుంచి ఒకే సీటులో కొనసాగడం బాగా కలిసొచ్చింది. జాతీయ ఆహార భద్రత మిషన్, ఎన్‌ఎంఓఓపీ (జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం) వ్యవహారాలు చూసేవారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద రైతులకు ఆయిల్ ఇంజిన్లు, వాటర్ క్యారియింగ్ పైపులు 50 శాతం సబ్సిడీపై ఇస్తారు. వీటిని సంబంధిత ఏడీఏ సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసి .. ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడానికి వీలుగా జేడీఏ కార్యాలయానికి నివేదికలు పంపుతారు. ఏడీఏలు ఇచ్చిన బిల్లుల ఆధారంగా జేడీఏ కార్యాలయంలో ప్రొసీడింగ్ తయారు చేసి.. ఆర్‌టీజీఎస్ ద్వారా ఏజెన్సీలకు నగదు బదిలీ చేస్తారు. ఇక్కడే రాజేష్ తెలివి ప్రదర్శించారు.
భార్య పేరుతో బోగస్ ఏజెన్సీలు
తన భార్య స్వాతి పేరుతో స్వాతి ఏజెన్సీస్, స్వాతి పైప్ ప్రైయివేటు లిమిటెడ్ అనే సంస్థలు ఏర్పాటు చేశారు. భార్య పేరుతోనే కర్నూలు శ్రీనగర్ కాలనీలోని ఎస్‌బీఐలో సేవింగ్ ఖాతా 20215151833 తెరిచారు. రెండు సంస్థలకూ ఇదే ఖాతా నంబర్ ఇచ్చారు. ఏడీఏల నుంచి వచ్చిన బిల్లులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి సబ్సిడీ మొత్తాన్ని వాటికి విడుదల చేసిన తర్వాత అవే బిల్లులకు స్వాతి ఏజెన్సీస్ పేరుతో మళ్లీ ప్రొసీడింగ్స్ తయారు చేసి.. సాంకేతిక అధికారి, జేడీఏలను తప్పుదోవ పట్టించి సంతకాలు చేయించారు. ఆర్‌టీజీఎస్ ద్వారా నిధులు భార్య ఖాతాకు మళ్లించారు. 2018–19కి సంబంధించి ఆగస్టులో ఒకటి, నవంబరు 2, డిసెంబరు 1, ఫిబ్రవరిలో 1 ప్రకారం ప్రొసీడింగ్స్ సృష్టించి పీడీ అకౌంట్ నుంచి మొత్తం రూ.28.65 లక్షలు కొల్లగొట్టారు. 286 మంది రైతుల పేర్లను పేర్కొని.. సబ్సిడీ మొత్తాన్ని స్వాతి ఏజెన్సీస్‌కు రూ.28.25 లక్షలు, స్వాతి పైప్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు రూ.40 వేలు చొప్పున మళ్లించారు. ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఇంతే! 2018–19కి ముందు కూడా అక్రమాలు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం ఎక్కువే
రాజేష్ వ్యవహారాలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టలేదు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం 2018–19కి సంబంధించి స్కీమ్‌లను ఆడిట్‌కు సిద్ధం చేస్తుండగా...రాజేష్ అక్రమాలు బయట పడ్డాయి. అధికారులు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు వెళ్లి బోగస్ బిల్లులపై సంతకాలు చేయించినట్లు తెలుస్తోంది. ఆయనపై అంతవరకు ఎలాంటి ఆరోపణలు లేనందున అధికారులు కూడా ముందూ వెనుక చూడకుండా సంతకాలు పెట్టినట్లు సమాచారం. తీరా రూ.28.65 లక్షలు కాజేసి సంతకాలు పెట్టిన అధికారులను కూడా అక్రమాల ఊబిలోకి లాగారు. స్వాతి ఏజెన్సీస్, స్వాతి పైప్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఒకే ఖాతా నంబరు ఉన్నా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం.
సమగ్ర విచారణకు ఆదేశం
జూనియర్ అసిస్టెంట్ రాజేష్ అక్రమాలపై జేడీఏ ఠాగూర్ నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజేష్ జేడీఏ కార్యాలయానికి వచ్చినప్పటి నుంచి ఆయన చూసిన వ్యవహారాలను క్షుణంగా పరిశీలించేందుకు ఐప్యాడ్ డీపీడీ వెంకటేశ్వరరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment