ఏసీబీకి చిక్కిన సాంఘిక సంక్షేమశాఖ ఉద్యోగి
Published Thu, Nov 14 2013 1:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు, న్యూస్‌లైన్ :కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం పంపిన చెక్కును ఇచ్చేందుకు లంచం తీసుకొంటూ సాంఘిక సంక్షేమశాఖ జూనియర్ అసిస్టెంట్ నామతోటి విజయబాబు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆ వివరాలను విజయవాడ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ విలేకరులకు వివరించారు. పిడుగురాళ్ళ మండలం పిలుట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజబాబు దాచేపల్లి మండలం కొత్తూరుకు చెందిన సునీతాబాయ్ 2011లో కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి వీరు దరఖాస్తు చేయడంతో మూడు నెలల కిందట రూ.50 వేల చెక్కును ప్రభుత్వం పంపింది. ఈ చెక్కును ఇచ్చేందుకు విజయబాబు రూ.5000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకపోవడంతో మూడు నెలలైనా లబ్ధిదారులకు చెక్కు అందలేదు.
చెక్కు గడువు ఈనెల 13వ తేదీకి పూర్తి అవుతుందని, కనీసం రూ.4000 ఇచ్చి చెక్కు తీసుకోవాలని విజయబాబు చెప్పడంతో రాజబాబు విజయవాడ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు రంగు పూసిన ఐదువందల రూపాయల నోట్లు ఆరు బుధవారం విజయబాబుకు అందజేశాడు. నగదు తీసుకుని ప్యాంట్‌లో జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విజయబాబు ఇంటి వద్ద కూడా సోదాలు నిర్వహించి అవినీతి వ్యవహారంలో నగదు సంపాదిస్తే మరో కేసు నమోదు చేసి విచారిస్తామని డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 9440446164 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. దాడిలో ఏసీబీ సీఐలు ఎస్‌ఎస్‌వి నాగారాజు, బి.శ్రీనివాస్, టి.ఎస్.కె.రవి, సీతారామయ్య పాల్గొన్నారు.
Advertisement