పట్టుబడిన నగదుతో సూర్యభగవాన్
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు) : నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేరు మార్పునకు వచ్చిన దరఖాస్తుదారుడి నుంచి రూ.9 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడంతో వారు వల పన్ని ఉద్యోగిని పట్టుకున్నారు. వివరాల మేరకు పటమట సర్కిల్–3 కార్యాలయ పరిధిలోని ఎన్‌ఎంఎం స్కూల్ వద్ద ఉండే కోనేరు శైలజ పటమటలోని శ్రీరామ్స్ కోనేరు ఎన్‌క్లేవ్ అపార్టుమెంటులో ఆస్తి పన్నుకు మ్యుటేషన్ (పేరు మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్కిల్–3 కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పొన్నపల్లి సూర్యభగవాన్ రూ.9 వేలు డిమాండ్ చేశారు. సుమారు ఆరు నెలలుగా నిత్యం తనకు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని వే«ధింపులకు గురి చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు వ్యూహాత్మకంగా లంచం ఇచ్చే సమయంలో అవినీతి ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి తీసుకున్న రూ.9 వేలు, సూర్యభగవాన్ టేబుల్ సొరుగులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రకటించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరి చారు. కాగా, బిల్ కలెక్టర్‌గా అడుగిడిన సూర్యభగవాన్ రెండేళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు అయిన మొత్తంలో కొంత స్వప్రయోజనాలకు వినియోగించుకునేవాడని, ఈ విషయం వెలుగులోకి రావటంలో అప్పట్లో అకౌంట్స్ సెక్షన్‌కు బదిలీ చేశారని తెలిసింది.
అక్కడా తన పద్ధతిని మార్చుకోకపోవటంతో సర్కిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారని, అయినా తన ప్రవర్తనలో మార్పు లేకపోవడం శోచనీయమని వీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అకౌంట్స్ విభాగంలో పని చేసిన సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకు ముడుపులు తీసుకునే వారని సమాచారం. కాంట్రాక్టర్లకు ప్రతి నెల టార్గెట్ పెట్టి మరీ వసూలు చేసే వారని, వీరపాండ్యన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో సూర్యభగవాన్‌ను సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారని వీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment