అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి యజమాని.. | ACB attacks On Junior Assistant Dwarkar Residence | Sakshi
Sakshi News home page

అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి యజమాని..

Published Mon, Dec 31 2018 8:11 AM | Last Updated on Mon, Dec 31 2018 11:37 AM

ACB attacks On Junior Assistant Dwarkar Residence - Sakshi

తణుకు: అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి ఆయన యజమాని.. అత్యంత విలాసవంతమైన జీవితం.. ఖరీదైన కార్లు... కళ్లు చెదిరిపోయే ఇల్లు.. సినిమా హాల్‌ను తలపించే భారీ తెర.. ఒక్కోటి రూ. లక్షలు విలువ చేసే చేతి గడియారాలు.. ఇలా అతని ఆర్థిక వ్యవహారాలను చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం.. జిల్లా కేంద్రం ఏలూరులోని పంచాయతీరాజ్‌ శాఖ  ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్‌కు చెందిన అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.

 ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని దివాకర్‌ నివాసంతోపాటు తణుకులోని ఆయన కార్యాలయంలో, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఆయన బంధువుల ఇంటిపైనా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు అడిషినల్‌ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో దివాకర్‌తోపాటు అతని తల్లి రాంపల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు రాంపల్లి శ్రీనివాస రామకృష్ణ కిరణ్‌కుమార్‌ పేర్లపై సుమారు రూ. 100 కోట్లు ఆక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల వ్యవధిలోనే ఈ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏడాదిగా దివాకర్‌ సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉద్యోగి నుంచి రియల్టర్‌గా...
ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన దివాకర్‌ పంచాయతీరాజ్‌ శాఖ ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం చింతలపూడిలో 2009 జూన్‌ 15న జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ఇతని తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో దివాకర్‌కు ఉద్యోగం ఇచ్చారు. అయితే కొద్ది కాలంలోనే రియల్టర్‌గా అవతారం ఎత్తిన దివాకర్‌ డెప్యూటేషన్‌పై ఏలూరు ఎస్‌ఈ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఏడాదిగా సెలవులో కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాలతో అడిషినల్‌ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం వేకువజామున పాలంగిలోని దివాకర్‌ నివాసానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇంట్లోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు, అత్యంత ఖరీదైన చేతిగడియారాలు, విలాసవంతమైన ఐదు కార్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకులోని రాఘవేంద్ర రెసిడెన్సీలోని దివాకర్‌కు చెందిన కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఏసీబీ గుర్తించిన అక్రమాస్తులు ఇవే...
దివాకర్‌ కుటుంబానికి వ్యవసాయ భూమి  85.62 ఎకరాలు, బంగారం అరకిలో, వెండి 5 కిలోలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.  హౌస్‌ ఫ్లాట్లు, 19, ఫామ్‌ హౌస్‌ 1, జీప్లస్‌2 నివాసగృహం 1, కమర్షియల్‌ జీప్లస్‌3 భవనం, గోదాం 1 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంట్లో నగదు రూ. 6.25 లక్షలు, విదేశీ కరెన్సీ రూ. 60 వేలు, బ్యాంకు నిల్వ రూ. 3 లక్షలు,  ఇంట్లోని ఫర్నీచర్‌ రూ. 30 లక్షలు, కార్లు 5,  మోటారుసైకిళ్లు 2 ఉన్నట్టు గుర్తించారు. 

పెద్దలే బినామీలు
ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దివాకర్‌ అక్రమార్జనతోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టారా? లేక ఎవరికైనా ఇతను బినామీగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన దివాకర్‌ కొద్దికాలంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులకు ఇతను బినామీగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి అత్యంత సమీప బంధువుతో ఇతను కొంతకాలంగా ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతోనే దివాకర్‌ ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. దివాకర్‌ను అరెస్టు చేశారు. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.  ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు బి.సుదర్శన్‌రెడ్డి, ఎల్‌.సన్యాసినాయుడు, భాస్కరరావు, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement