సాక్షి, అమరావతి : ఈఎస్‌ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఏసీబీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తులోనూ ఇది తేలిందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ స్కాం వివరాలను వెల్లడించారు. ఈఎస్‌ఐ స్కాంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని, దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించిన పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏసీబీ దర్యాప్తులో అక్రమాలు నిర్దారణ అయ్యాక నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్)
విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైనా అవినీతి అక్రమాలు జరిగినట్లు తేలిందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో కట్టబెట్టారని వెల్లడించారు. విజిలెన్స్ దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పట్లు తేలిన తరువాతనే ఏసీబీ విచారణ జరిపినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారిలో అచ్చెన్నాయుడుతో పాటు తిరుపతికి చెందిన ఈఎస్‌ఐ డైరెక్టర్ సికే రమేష్ కుమార్, రాజమండ్రికి చెందిన విజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment