లోకేష్‌తో మాట.. సీఎంకు బంధువట ! | ACB raids municipal commissioner Avineni Prasad house | Sakshi
Sakshi News home page

లోకేష్‌తో మాట.. సీఎంకు బంధువట !

Published Wed, Sep 20 2017 8:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

లోకేష్‌తో మాట.. సీఎంకు బంధువట ! - Sakshi

లోకేష్‌తో మాట.. సీఎంకు బంధువట !

నాయుడుపేట టౌన్‌/నెల్లూరు:

అందరితోనూ అల్లుకుపోయే కలుపుగోలుతనం ఆయన సొంతం. రూ.5 వేలు.. 10 వేలు ఇస్తే తీసుకోని నైజం. కనీసం రూ.50 వేలు.. ఆపై లక్షలకు లక్షలు ఇస్తే తప్ప పనులు చేయని తెంపరితనం. ‘సీఎం చంద్రబాబు నాయుడు నాకెంతో దగ్గర బంధువు. ఇప్పుడే నారా లోకేష్‌తో మాట్లాడా’నని దర్పం ప్రదర్శించడం అతడి గొప్పతనం. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై అరెస్టైన నాయుడుపేట నగర పంచాయతీ కమిషనర్‌ అవినేని ప్రసాద్‌ తీరిది.

చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ మేనేజర్‌ హోదాలో ఉంటూ డెప్యుటేషన్‌పై నాయుడుపేట నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు తిరుపతిలో ఉన్న ఇల్లు, నాయుడు పేట నగర పంచాయతీ కార్యాలయం, నెల్లూరు, శ్రీకాళహస్తి, రాజంపేటలోని స్నేహితుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ విలువ ప్రకారం రూ.4.17 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ప్రసాద్‌ కూడబెట్టిన ఆస్తుల్లో బహుళ అంతస్తుల భవనాలు, భారీగా స్థలాలు ఉన్నాయి. అతడు ఏసీబీకి పట్టుబడ్డారన్న సమాచారం తెలిసి నాయుడుపేట నగర పంచాయతీ కార్యాలయం ఎదుట స్థానికులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

నేపథ్యమిదీ..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అవినేని ప్రసాద్‌ 1998 సెప్టెంబర్‌ 28న తిరుపతి మున్సిపాల్టీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. అక్కడే ఆర్‌ఐగా పదోన్నతి పొందారు. ఆ తరువాత పదోన్నతిపై చిత్తూరు జిల్లా నగరి మున్సిపాల్టీలో మేనేజర్‌గా చేరారు. 2015 జనవరి 30న అక్కడి నుంచి డెప్యుటేషన్‌పై నాయుడుపేట నగర పంచాయతీ కమిషనర్‌గా వచ్చారు. మున్సిపల్‌ మేనేజర్‌ హోదాలో ఉంటూ.. డెప్యుటేషన్‌పై రెండేళ్ల క్రితం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్‌ కోట్లాది రూపాయల ఆస్తులను కూడగడుతున్నారని.. లంచాల కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

దీంతో ఏసీబీ డీఎస్పీ పరమేశ్వరరెడ్డి సారధ్యంలో ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిధిలోని ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఐదుచోట్ల సోదాలు నిర్వహించారు. తిరుపతిలోని ఆయన ఇంటితోపాటు నాయుడుపేట, నెల్లూరు, శ్రీకాళహస్తి, రాజంపేటలో తనిఖీలు జరిగాయి. నాయుడుపేట నగర పంచాయతీ కార్యాలయంతోపాటు తిరుపతిలోని ప్రసాద్‌ నివాసం, నెల్లూరులో ఆయన కుమార్తె, శ్రీకాళహస్తిలో తల్లి నివాసంతోపాటు రాజంపేటలోని ఇద్దరు స్నేహితుల ఇళ్లను ఏసీబీ అధికారులు సోదా చేశారు. ఆయన కూడబెట్టిన అక్రమాస్తుల వివరాలు తనిఖీల్లో బయట పడ్డాయి.

సోదాలు సాగాయిలా..
నాయుడుపేట నగర పంచాయతీ కార్యాలయంలో ఒంగోలు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ సారధ్యంలో పలు శాఖలకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయానికి కమిషనర్‌ ఇక్కడ లేకపోవడంతో నగర పంచాయతీ మేనేజర్‌ ఉమామహేశ్వరరావు సమక్షంలో కమిషనర్‌కు సంబంధించిన బీరువా తెరిచి అందులో రికార్డులు, తదితరాలను నిశితంగా పరిశీలించారు. ఆయన చాంబర్‌లో ఉన్న కంప్యూటర్‌లో పొందుపరిచిన వివరాలు, డిజిటల్‌ రికార్డులను సైతం అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. మధ్యాహ్నం వరకు సోదాలు కొనసాగాయి.
ఇదిలావుండగా.. పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్‌ రోడ్డులో గల శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌ నిర్వాహకుడు పూనాటి తిరుమలనాయుడు నివాసం ఉంటున్న ఫ్లాట్‌లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాను తిరుమలనాయుడు నుంచి లక్షలాది రూపాయలు అప్పు తీసుకున్నట్టు కమిషనర్‌ ప్రసాద్‌ తిరుపతిలో సోదాలు నిర్వహించిన అధి కారులకు చెప్పడంతో ఇక్కడ తనిఖీలు చేశారు. తిరుమలనాయుడు ఇంట్లో సాయంత్రం వరకు ఉండి పూర్తి వివరాలను ఆరా తీశారు. తిరుమలనాయుడు వద్ద కమిషనర్‌కు సంబంధించి ఉన్న ప్రామిసరీ నోట్లు, ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌తో సఖ్యతగా మెలిగే గాలి రమేష్‌నాయుడు తదితరులను సైతం అధికారులు విచారణ చేసి పలు వివరాలను రాబట్టినట్టు తెలియవచ్చింది.

నెల్లూరులోనూ సోదాలు
కమిషనర్‌ ప్రసాద్‌ కుమార్తె నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్, కుమారుడు నగరంలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఇంట ర్మీడియెట్‌ చదువుతున్నారు. వారు తమ అమ్మమ్మతో కలిసి నగరంలోని చిల్డ్రన్స్‌ పార్క్‌ ప్రాంతంలోని రాంజీనగర్‌ నాలుగో వీధిలో ఓ ఇంట్లో ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు. ప్రసాద్‌ తరచూ పిల్లల వద్దకు వచ్చి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ ఆ«ధ్వర్యంలో సిబ్బంది ఆ ఇంట్లో సోదాలు చేపట్టారు. ప్రసాద్, అతని భార్య పేరిట ఉన్న పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఐదుచోట్ల తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు అతడికి బినామీ పేర్లతో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

తిరుపతి నగరంలోని కపిల తీర్థం రోడ్డులో గల ఎన్జీఓ కాలనీలో రూ.1.50 కోట్ల విలువచేసే ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్, ఓ ఇంటి స్థలం, ఇళ్లు, తిరుపతి, తిరుపతి రూరల్‌ పరిధిలోని చెన్నకేశవపురంలో భూములున్నట్టు గుర్తించారు. అతని భార్య బబిత పేరిట తిరుపతిలో నాలుగు ఇంటి స్థలాలు, ఒక ఇంటిని గుర్తించారు. ప్రసాద్‌ తల్లి వనజాక్షి పేరిట శ్రీకాళహస్తిలో మూడంతస్తుల భవనం, తిరుపతిలో ఓ  ఇంటిస్థలం, తిరుపతి రూరల్‌ గాజులమంద్యంలో స్థలం, మహేంద్ర ఎక్స్‌ యూవీ కారును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రిజిస్ట్రేషన్‌ లెక్కల ప్రకారం రూ.4.17 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి కమిషనర్‌పై కేసు నమోదు చేశారు. దాడులకు నెల్లూరు డీఎస్పీతో పాటు సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ) డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి నేతృతవ్వం వహించారు.

సీఎం బంధువునంటూ చెలరేగిపోయాడు
కమిషనర్‌ ప్రసాద్‌ నాయుడుపేటలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను సమీప బంధువునని, నారా లోకేష్‌తో తరచూ మాట్లాడుతుంటానని హల్‌చల్‌ చేస్తుండేవారని మున్సిపల్‌ సిబ్బంది, పలువురు నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే అతడు కోట్లాది రూపాయలను ఆర్జించాడని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మున్సిపల్‌ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీఓ 279 ప్రకారం కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని చెప్పి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కమిషనర్‌ భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి.

తమ కడుపుకొట్టేలా ఉన్న ఆ జీఓను తక్షణమే రద్దు చేయాలంటూ కార్మికులు పోరా టాలకు దిగటంతో.. సదరు వ్యక్తి తన నుంచి తీసుకున్న సొమ్మును తిరిగివ్వాలని కోరగా కమిషనర్‌ ససేమిరా అన్నట్టు సమాచారం. నాయుడుపేట పట్టణంలో ఆక్రమణల తొలగింపు మొదలుకొని భవనాలు, అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణాలకు సంబంధించి పెద్దఎత్తున సొమ్ములు గుంజారనే ఆరోపణలు ఉన్నాయి. నగర పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే విషయం తెలిసి పలువురు బాధితులు అక్కడకు చేరుకున్నారు. తమకు చేసిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు.

అయితే ఏసీబీ అధికారులు ఎవరితో మాట్లాడలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఇదిలావుండగా.. కమిషనర్‌ ప్రసాద్‌ చిత్తూరు జిల్లా నగరిలో మేనేజర్‌గా పనిచేసిన కాలంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తినట్టు సమాచారం. దీంతో ఆయన విధులకు దీర్ఘకాలిక సెలవు పెట్టినట్టు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తిరిగి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారని.. డెప్యుటేషన్‌పై నాయుడుపేట కమిషనర్‌గా పోస్టింగ్‌ వేయించుకు న్నారని మున్సిపల్‌ వర్గాల భోగట్టా.

సంబరాలు జరుపుకున్న స్థానికులు
కమిషనర్‌ ప్రసాద్‌ అక్రమాస్తుల గుట్టును ఏసీబీ అధికారులు వెలికి తీస్తున్నారనే విషయం తెలిసి మంగళవారం మధ్యాహ్నం పట్టణానికి చెందిన పలువురు నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పీడ వదిలిందంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement