భూ మాయాజాలం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు
విశాఖపట్నం: విశాఖ జిల్లా భూ మాయాజాలంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తహసీల్దార్ మజ్జి శంకర్‌రావుపై ఏసీబీ శాఖ దాడులు ప్రారంభించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసులు నమోదు చేసి పలుచోట్ల సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని గాజువాక సహా విజయనగరం, నర్సీపట్నం, బొబ్బిలి, శ్రీకాకుళంలో ఆయన బంధువుల నివాసాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
శంకర్‌రావు కుమారుడి అత్తగారు కొటవురట్ల ఎంపీపీ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. శంకర్‌రావు గతంలో విశాఖ రూరల్ తహశీల్దార్‌గా పని చేశారు. ఈ సమయంలో శంకర్‌రావు పెద్దయెత్తున భూరికార్డులు మాయం చేసిన వ్యవహారంలో సస్పెండ్ అయ్యారు. తర్వాత ప్రభుత్వం నుంచి మళ్లీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. తనకు విశాఖ జిల్లాలోనే పోస్టింగ్ కావాలని పట్టుబట్టినప్పటికీ.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆయన ఇక్కడ వద్దంటూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ పరిణామాలతో శంకర్‌రావుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలో విశాఖ భూరికార్డుల మాయంపై నమోదైన క్రిమినల్ కేసులో నిందితుడిగా శంకర్‌రావును చేర్చడంతో ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన ఆస్తుల వేటలో భాగంగా బుధవారం కూడా ఏసీబీ పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది.