వర్గల్, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారులు మారో లంచావతారాన్ని పట్టేశారు. ఓ లబ్ధిదారున్నుంచి రూ,10 వేలు తీసుకున్న హౌసింగ్ ఇన్‌స్పెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతికి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం...వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన ఎర్ర సత్తమ్మకు రచ్చబండ ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
ఈ మేరకు ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారు సత్తమ్మ కుమారుడు మల్లేశం ఇంటి బిల్లు కోసం వర్గల్ మండల హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ వి.కొండల్‌రెడ్డిని సంప్రదించాడు. మొత్తం నాలుగు దఫాలుగా ఇచ్చే ఇంటి బిల్లు రూ.90 వేలుఒకేసారి ఇచ్చేందుకు వర్క్ ఇన్‌స్పెక్టర్ కొండల్‌రెడ్డి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సత్తమ్మ కొడుకు మల్లేశం ఆయన్ను బతిమిలాడి చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొండల్‌రెడ్డి సూచన మేరకు ఆ మొత్తాన్ని బుధవారం నాచారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) వద్ద ఇస్తానని తెలిపాడు.
అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చేరవేసిన మల్లేశం, వారి సూచనలకు అనుగుణంగా బుధవారం తల్లి సత్తమ్మతో కలిసి ఉదయం 9 గంటలకు బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.10 వేలను హౌసింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌కు లంచంగా ఇచ్చేందుకు జేబులో భద్రపరచుకున్నాడు. ఒంటి గంట ప్రాంతంలో బ్యాంకుకు చేరుకున్న కొండల్‌రెడ్డి లబ్ధిదారు సత్తమ్మ, ఆమె కొడుకు మల్లేశంను బ్యాంకులోకి తీసుకెళ్లాడు. తన వద్ద ఉన్న సత్తమ్మ పాసు బుక్కును అక్కడి బ్యాంకు అధికారులకు చూపించి అందులోనుంచి బిల్లు మొత్తాన్ని దాదాపు రూ.90 వేలు లబ్ధిదారు సత్తమ్మకు ఇప్పించాడు.
బ్యాంకు వెలుపలికి రాగానే మల్లేశం ఇచ్చిన రూ.10 వేలను తీసుకున్న వర్క్ ఇన్‌స్పెక్టర్ కొండల్‌రెడ్డి తన జేబులో పెట్టుకున్నాడు. ఈ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడిచేసి నిందితున్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇతర గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెందిన బ్యాంకు పుస్తకాలు స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు.
బ్యాంకులో డబ్బులు డ్రా చేసే సమయంలో ఏసీబీకి చిక్కకుండా లబ్ధిదారుల నుంచి లంచం సొమ్ము స్వీకరించేందుకు వర్క్ ఇన్‌స్పెక్టర్ పాస్‌పుస్తకాలు తన వద్దనే ఉంచుకోవడం ఆశ్చర్యపరుస్తోందని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన కొండల్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. అవినీతి అడ్డుకునేందుకు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446155 నంబర్‌కు సమాచారమివ్వాలని ఆయన సూచించారు.
ఏసీబీ వలలో హౌసింగ్ చేప
Published Thu, Feb 6 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement