- వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బి.సంజీవరావు
జోగిపేట : కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష కమిటీ సమావేశానికి వైఎస్‌ఆర్‌సీపీని రాష్ట్ర ప్రభుత్వం భయపడే ఆహ్వానించలేదని, కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఫోన్‌లో సాక్షితో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్‌ఆర్‌సీపీని జాతీయ పార్టీగా గుర్తించిందన్నారు. సమావేశానికి పిలిస్తే వాస్తవాలను తెలుసుకుని ప్రజల చెబుతారనే భయంతో పిలవలేదన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ లక్షల ఓట్లు సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో దివంగత నేత వైఎస్‌ఆర్ అభిమానులు టీఆర్‌ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
తెలంగాణ రాష్ర్టంలో లక్షలాది మంది ప్రజల గుండెల్లో దివంగత నేత వైఎస్‌ఆర్ ఉన్నారన్న విషయాన్ని మరవొద్దన్నారు. గత సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున నలుగురు శాసనసభ్యులు, ఎంపీ గెలిచిన విషయాన్ని ప్రభుత్వం మరచిందన్నారు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్నారు. రాష్ర్టంలో ప్రతిపక్షపార్టీగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీని ఆహ్వానించకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.