ప్రభుత్వానిది దౌర్జన్యం
నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడంపై పలు పార్టీలు, ప్రజా సంఘాల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీపై పోలీసు నిర్భంధాన్ని ప్రయోగించడం దారుణమని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, యువజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశాయి.
‘‘ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తుంటే తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ తీరు గుర్తుకొస్తోంది. పోలీసుల దౌర్జన్యం, అణచివేత సరికాదు..’’
– డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
‘‘టీజేఏసీ ర్యాలీ పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. జేఏసీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సరికాదు..’’
– వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
‘‘ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి యువతను భయభ్రాంతులకు గురిచేసింది. కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ అరెస్టు చేయడం ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తికే స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణం. కేసీఆర్ అప్రజాస్వామిక పోకడలకు ఇది పరాకాష్ట..’’
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
కచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్రే...
అక్రమ అరెస్టులు, నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని, జేఏసీ ర్యాలీలో విధ్వంసం జరుగుతుందంటూ హైకోర్టులో అఫిడవిట్ వేయటం వెనుక అంతర్యం ఏమిటని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీపై అసత్యాలను ప్రచారం చేస్తూ, చివరి నిమిషంలో అనుమతి నిరాకరణ కచ్చితంగా ప్రభుత్వ కుట్రేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య విమర్శించారు. నిరుద్యోగ ర్యాలీని అడ్డుకునే పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హింసాకాండకు, నిరంకుశత్వానికి పాల్పడిందని, పార్టీ, ప్రజాసంఘాల కార్యాలయాలను పోలీసులతో దిగ్భంధించడం దారుణమని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ (చంద్రన్న) నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్‌లు ఆరోపించారు.
ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనంటూ ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ దుయ్యబట్టారు. యువజనులు, విద్యార్థుల భుజాలపై స్వారీ చేసి.. ఉద్యమాల ద్వారా గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం చేపట్టిన పోరాటాన్ని పోలీసు నిర్భందం ద్వారా అణచేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డా.పాండురంగారావు తెలిపారు.