
సాక్షి, హైదరాబాద్: లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను పూర్తిగా వంచించిందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని శనివారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ఖమ్మం జిల్లాలో నిర్వహించాలనుకున్న నిరుద్యోగ గర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున అదే సభను ఈ నెల 21న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు.
నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తికి సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి మాత్రం చేతులు రావటం లేదన్నారు. నిరుద్యోగ గర్జన సభకు నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.