వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పంజగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లో పంజగుట్ట సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇతరనాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వైఎస్సార్‌ను స్మరించుకునే రోజని, ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతీ గుడిసెకు, గుండెకు చేరుకోవడంతో ప్రజలకు మహానేత చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అక్కడ అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలోనూ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ మహేష్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, నేతలు జస్వంత్‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల హృదయాల్లో చెరగని స్థానం
వైఎస్సార్‌కు కాంగ్రెస్ నివాళి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్, అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయాల్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ నాయకులు మల్లు రవి, బొల్లు కిషన్, అఫ్జలుద్దీన్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment