ఏసీబీ దాడుల కలకలం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఏసీబీ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్ట్‌లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ పై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి రూ.14వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చిత్తూరులో పలమనేరు, నరహరిపేటలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వాణిజ్యపన్నుల కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయాలలో రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పలమనేరులో రూ.32 వేలు, నరహరిపేటలో రూ.51 వేలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దు ఇచ్చాపురం చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎనిమిది మంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి రూ.64వేలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో పొందుగల కమర్షియల్ చెక్ పోస్టుపై దాడులు జరిపిన ఏసీబీ అధికారులు రూ.22వేలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.