ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ | ACB Ride on Irrigation SE House East Godavari | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ

Published Sat, Dec 21 2019 1:11 PM | Last Updated on Sat, Dec 21 2019 1:11 PM

ACB Ride on Irrigation SE House East Godavari - Sakshi

కాకినాడలో ఎస్‌ఈ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు ఎస్‌ఈ కృష్ణారావు

జిల్లా నీటిపారుదల శాఖ ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌లో పర్యవేక్షక ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నల్లం కృష్ణారావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రాష్ట్రంలో ఆరు చోట్లతోపాటు తెలంగాణలోనూ తనిఖీలునిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

కాకినాడ క్రైం: ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారనే సమాచారంతో జిల్లా నీటిపారుదల శాఖ ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌లో పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ) నల్లం కృష్ణారావుపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో రాష్ట్రంలో ఆరు చోట్ల, తెలంగాణ రాష్ర ్టంలోని హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ. 15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.  కాకినాడ సర్పవరం జంక్షన్‌ సమీపంలోని పాతగైగోలుపాడు సుందర్‌నగర్‌లో ఉన్న కృష్ణారావు ఇంటిలో, ఆయన బంధువులు, సహచరుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలను చేపట్టారు. ఆయన సొంత ఊరైన భీమవరంలో, ఆయన నివాసం ఉంటున్న కాకినాడలో, పని చేస్తున్న ధవళేశ్వరంలో, అనకాపల్లిలోని ఆయన అల్లుని ఇంటిపైన, రాజమహేంద్రవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలతో పాటు హైదరాబాద్‌లోను  దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. ఐదు కోట్లకు పైగా ఆస్తులను, పెద్ద మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ప్రామిసరీ నోట్లు, స్థలాల దస్తావేజులతో పాటు  రూ. 68 లక్షల బ్యాంక్‌ డిపాజిట్లను గుర్తించారు. వీటి విలువ మార్కెట్‌ రేటు ప్రకారం రూ. 3 కోట్ల 35 లక్షల 42వేల 961 అని, బహిరంగ మార్కెట్‌ రేట్ల ప్రకారం రూ. 15 కోట్లు పైబడి ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. బ్యాంకు లాకర్లను తెర వాల్సి ఉందని, దాడులు కొనసాగుతున్నాయన్నా రు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న నేరంపై ఇరిగేషన్‌ ఎస్‌ఈ నల్లం కృష్ణారావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ అడిషినల్‌ ఎస్పీ రవికుమార్‌ తెలిపారు.

ధవళేశ్వరంలో..  
ధవళేశ్వరం: ఏసీబీ అధికారులు ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఎస్‌ఈ గదిలో సోదాలు జరిపారు. కంప్యూటర్లు, ఫైళ్లను పరిశీలించి రెండు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోదాలు జరిగాయి. ధవళేశ్వరంలో ఎస్‌ఈకి సన్నిహితంగా ఉండే మరో ఉద్యోగి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపినట్టు సమాచారం.   పూర్తి వివరాలను తమ ఉన్నతాధికారులు వెల్లడిస్తారని ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ మీడియాకు తెలిపారు. 

దాడుల్లో పట్టుబడ్డ ఆస్తుల చిట్టా  
నల్లం కృష్ణారావు  2004లో కాకినాడ శ్రీరంగరాయణం రెసిడెన్సీలో 104 నంబరు గల ప్లాట్‌ను రూ. 9.81 లక్షలకు, రాజానగరంలో ఒక ఇంటిస్థలం రూ. 12.50 లక్షలకు కొనుగోలు చేశారు.
కృష్ణారావు భార్య నల్లం కృపామణి పేరుతో హైదరాబాద్‌ మియాపూర్‌లో 2019లో హైరిచ్‌ అపార్టుమెంట్‌లో ప్లాట్‌ కొనుగోలుకు  రూ. 10 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు.
విశాఖ జిల్లా పెందుర్తిలో 2003లో రూ. 74, 760లతో ఒక ఖాళీ స్థలాన్ని, కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట సుందర్‌నగర్‌లో రూ.5,85 లక్షలతో ఇంటి స్థలాన్ని, సామర్లకోట మండలం ఉండూరు పంచాయతీ వల్లూరులో రూ.2.46 లక్షలతో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు.

వ్యవసాయ భూమి
2008లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం రాయకుదురులో రూ.3.10 లక్షల తో వ్యవసాయభూమిని కొనుగోలు చేశారు. అదే ఏడాది అదే గ్రామంలో మరో రూ. లక్షతో కొంత, రూ. 25 వేలతో మరి కొంత వ్యవసాయ భూమిని కొన్నారు.
తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెంలో 2010లో రూ. 9 లక్షలతోను,  రాయకుదురు చింతలకోటిచెరువులో 2012లో 1.02 లక్షలతో,  రాజానగరం మండలం వెంకటాపురంలో 2018 లో రూ. 6.55 లక్షలతో ఖాళీ స్థలాలను, కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మహళ్లిలో 2011లో రూ. 42.50 లక్షలతో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

కృష్ణారావుకు ఉన్న ఇళ్లు
2017లో కాకినాడలో రూ. 98.54లక్షల విలువైన జీప్లస్‌ 1 ఆర్‌సీసీ భవనం నిర్మించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో రూ. 15 లక్షల విలువైన జీప్లస్‌ 1 ఆర్‌సీసీ భవనం నిర్మించారు.
కృష్ణారావు కుమారుడు నల్లం రోహిత్‌ పేరుతో కాకినాడ శ్రీనగర్‌లోని నందాస్‌ అపార్టుమెంట్‌లో 2013లో రూ. 22.34 లక్షలతో ప్లాట్‌నంబర్‌ 302ను కొనుగోలు చేశారు.
ఆయన కుమార్తె స్నేహిత పేరుతో సామర్లకోట మండలం ఉండూరు గ్రామం వల్లూరులో 2008లో రూ. 1.28 లక్షలతో ఇంటి స్థలం కొన్నారు. అదే ఏడాది ఆమె పేరుతో పెనుగొండ మండలం రాయకుదురులో రూ. 3.75 లక్షలతో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.

ఇతర ఆస్తుల వివరాలు  
రూ.6.41 లక్షల విలువైన 332.90 గ్రాముల బంగారు ఆభరణాలు.
రూ.1.89 లక్షల విలువైన 622.810 గ్రాముల వెండి ఆభరణాలు.
రూ.7.78 లక్షల విలువైన గృహోపకరణ వస్తువులు.
రూ. 1.94,480 నగదు.
రూ. 38,89,091 విలువైన ఎఫ్‌డీఆర్‌లు.
రూ. 28 లక్షల 66వేలు బ్యాంకు బ్యాలెన్స్‌.
రూ. 6 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు.
రూ. 70 వేల విలువైన యాక్టివా మోటార్‌ సైకిల్‌.

కృష్ణారావు ఉద్యోగ ప్రస్థానం
నల్లం కృష్ణారావు 1986 మార్చి 6న ఇరిగేషన్‌శాఖలో ఏఈగా చేరారు. విశాఖపట్నం, కాకినాడ, సామర్లకోటల్లో ఏఈగా పనిచేశారు. పదోన్నతిపై ఏలేరు ఇరిగేషన్‌ సబ్‌డివిజన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గాను, సామర్లకోట, ధవళేశ్వరం సబ్‌డివిజన్‌లోను పని చేశారు. కాకినాడ డివిజన్‌ పరిధిలోని ఇరిగేషన్‌ డీఈగా, ఏలేరు ఇరిగేషన్‌ ప్రాజెక్టు డీఈగా, వశిష్ట, గోదావరి సెంట్రల్‌ డెల్టా డీఈగా పని చేశారు. ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌  ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో పని చేస్తూ 2017 డిసెంబర్‌ 3న ధవళేశ్వరం ఇరిగేషన్‌ పర్యవేక్షక ఇంజినీరు (ఎస్‌ఈ)గా బాధ్యతలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement