ఏడీ ప్రభాకరరావు ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ –1గా విధులు నిర్వహిస్తున్న మైలి ప్రభాకరావు ఇళ్లతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎస్‌కే షకీలా భాను ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. రాజమహేంద్రవరం, తణుకు, కాకినాడ, బెంగళూరు, తదితర ప్రాంతాల్లో సోదాలు చేయగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయనతో పాటు, భార్య పేరున సుమారు రూ.కోటి 66 లక్షలకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్టు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపారు.
ఆయన కథనం ప్రకారం.. అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలోని ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారావు రెండేళ్ల బీఈడీ విద్యను అభ్యసించడానికి 2018– 20 సంవత్సరాలకు గాను వేతనంతో కూడిన సెలవుకు ఆగస్టులో దరఖాస్తు చేసుకోగా డీఈఓ అనుమతి ఇస్తూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫైల్ పంపించారు. ఆ ఫైల్ క్లియర్ చేయకపోగా కార్యాలయం చుట్టూ తిప్పుతూ చివరకు లంచం డిమాండ్ చేయడంతో ప్రధానోపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు గతనెల 20న కాకినాడలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏడీ ప్రభాకరరావుకు సొమ్ము ఇస్తుండగా ఏబీసీ రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.సుధాకరావు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ప్రభాకరరావుకు సంబంధించిన ఇళ్లు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
టైపిస్ట్‌గా ఉద్యోగం ప్రారంభించి..
1982 అక్టోబర్ 23న విద్యాశాఖలో ప్రభాకరావు టైపిస్ట్‌గా విధుల్లోకి చేశారు. ఈయన విజయనగరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో అసిసెంట్ డైరెక్టర్ – 1 గా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభాకరావు భార్య పేరున ఉన్న ఆస్తులివీ..
ఏడీ ప్రభాకరరావు భార్య విజయకుమారి పేరున 1988లో విజయనగరంలో 200 గజాల ఖాళీ స్థలం, 2004లో 200 చదరపు గజాల ఖాళీ స్థలం, 2008లో తమిళనాడులోని కృష్ణగిరి కెంపట్టి గ్రామంలో 1200 గజాల ఖాళీస్థలం కొనుగోలు చేశారు. 2005లో విజయనగరంలో బాలాజీ టవర్స్‌లో 6.91 స్క్వేర్ యార్డ్స్ షాపును కొనుగోలు చేశారు.
విలువైన బంగారు, వెండి వస్తువులు
ఈ సోదాల్లో 500 గ్రాముల బంగారు నగలు(విలువ రూ 11,46,620),4.112 కిలోల వెండి వస్తువులు (విలువ రూ 1,15,355), గృహోపకరణాలు రూ. 3,13,150, క్యాష్ రూ.6,25,000, బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,96,959, రూ.ఆరు లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు సోదాల్లో లభించాయని తెలిపారు. వీటితో పాటు మారుతి ఆల్టో కారు, హీరో ఫ్యాషన్ ప్లస్ మోటారు సైకిల్ అక్రమాస్తుల సోదాల్లో బయటపడ్డాయని తెలిపారు. మొత్తం రూ.కోటీ 66 లక్షల విలువైన ఆస్తులు లభించాయని తెలిపారు. ఈ సోదాల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు పి.వి. సూర్యమోహన్‌రావు, వి.పుల్లారావు, పి.వి.జి.తిలక్ పాల్గొన్నారు.
అక్రమాస్తుల వివరాలిలా..
ప్రభాకరరావు 2003లో విజయనగరంలో 400 చదరపు గజాలæ ఖాళీ స్థలం, 2005లో 200 చదరపు గజాల ఖాళీ స్థలాలను కొనుగోలు చేశారు. 2012లో కర్నూలు జిల్లా చంతన హల్లి గ్రామంలో 266.66 చదరపు గజాల ఖాళీ స్థలం కొనుగోలు చేశారు. 2014 బెంగళూరు, హుబ్లీలో 1287.50 గజాల స్థలం కొనుగోలు చేశారు. 2014 రాజానగరంలో 470.88 గజాలు, 2015 బెంగళూరు, హుబ్లీలో 2400 చదరపు గజాలు, 2015లో కర్నూలు జిల్లా నానూరు గ్రామంలో 171.41 చదరపు గజాలను కొనుగోలు చేశారు. విజయనగరంలో భగవాన్ రెసిడెన్సీలో ఎఫ్–2 ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2017లో రాజమహేంద్రవరం సమీపంలోని హుకుంపేటలో 1400 చదరపుగజాల నివాస భవనం కొనుగోలు చేశారు.
మసక బారుతున్నవిద్యాశాఖ ప్రతిష్ట
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెలలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడిచేసి రూ.పది వేలు లంచం తీసుకుంటుండగా ఏడీ ప్రభాకరరావును పట్టుకున్నారు. తిరిగి 20 రోజుల తరువాత ఆయన నివాసంలో మంగళవారం దాడులు నిర్వహించడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. విద్యాశాఖాధికారిపై ఏసీబీ అధికారులు దాడులు అనే ప్రచారం రావడంతో జిల్లా విద్యాశాఖాధి కార్యాలయానికి వారు వస్తారని పలువరు ఆందోళన చెందారు.
2016లో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు సస్పెండైన ఉపాధ్యాయుడికి తిరిగి ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో ఏసీబీకి చిక్కారు. తాజాగా ఏడీ ప్రభాకరరావు ఏసీబీకి చిక్కడంతో విద్యాశాఖలోనూ అవినీతి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment