ఉపాధ్యాయుల సర్దుబా(టు)ట
-
ప్రక్రియలో నిమగ్నమైన విద్యాశాఖ
-
జాబితాల తయారీకి కసరత్తు
రాయవరం :
వెదురుపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులుంటే గ్రేడ్–1, గ్రేడ్–2 హిందీ పండిట్లు ఉన్నారు. రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 620 మంది విద్యార్థులుంటే గ్రేడ్–1 హిందీ పండిట్ ఒక్కరే ఉన్నారు...ఈ లోపాలను సరిదిద్దేందుకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేసే ప్రక్రియకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను వర్క్ ఎడ్జస్ట్‌మెంట్(పని సర్దుబాటు) చేసే ప్రక్రియకు మండల స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేసేందుకు చేపట్టే రేషనలైజేషన్‌ను ప్రభుత్వం టీచర్ల తాత్కాలిక సర్దుబా(ట)టుగా మార్చింది.
ప్రారంభమైన ప్రక్రియ
పాఠశాలల్లో ఉపాధ్యాయుల మిగులు, కొరతను గుర్తించడానికి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై నెలాఖరుకు ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని 2016–17 విద్యా సంవత్సరానికి పనిసర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రేషనలైజేషన్ చేస్తారని ఉపాధ్యాయులు భావించారు. ప్రభుత్వంతో యూనియన్లు నెరపిన చర్చలతో రేషనలైజేషన్ ప్రక్రియను తాత్కాలికంగా విద్యాశాఖ వాయిదా వేసింది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకే ప్రస్తుతం తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ తెరపైకి తీసుకొచ్చింది.
పనిసర్దుబాటుకు మార్గదర్శకాలివే..
-
ఈ ఏడాది జులై 31వ తేదీ వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవాలి.
-
మిగులు ఉపాధ్యాయులను ఆ మండలంలోనే సర్దుబాటు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
-
ఇంకా మిగులు ఉపాధ్యాయులుంటే సర్వీస్ జూనియర్‌ను సర్దుబాటు చేయాల్సి ఉంది. సీనియర్ విల్లింగ్ ఇస్తే అతనికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
-
డివిజన్ స్థాయిలో ఉన్నత పాఠశాలలకు ఉప విద్యాశాఖాధికారి పనిసర్దుబాటు చేస్తారు.
-
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంఈవో ఆ పని పూర్తిచేస్తారు.
-
ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో ఎంఈవో, డివిజన్ స్థాయిలో డీవైఈవో ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
-
మిగులు ఉపాధ్యాయులను అవసరమైతే పక్కమండలాల్లో సర్దుబాబు చేస్తారు.
ప్రాథమిక పాఠశాలలో..
విద్యార్థులు ఉపాధ్యాయులు
1–19 1
20–60 2
61–90 3
91–120 4
361–400 11
ఉన్నత పాఠశాలల్లో...
విద్యార్థులు ఉపాధ్యాయులు
1–280 9
281–340 11
341–400 12
401–600 14
1181–1240 36
ఆదర్శ పాఠశాలల్లో...
విద్యార్థులు ఉపాధ్యాయులు
80–99 నలుగురు ఎస్‌జీటీలు
100–130 ఐదుగురు
131–160 ఐదుగురు,పీఎస్‌హెచ్‌ఎం
161–200 6, పీఎస్‌హెచ్‌ఎం
201–240 7, పీఎస్ హెచ్‌ఎం
241–280 8, పీఎస్ హెచ్‌ఎం
281–320 9, పీఎస్ హెచ్‌ఎం
321–360 10, పీఎస్ హెచ్‌ఎం
361–400 11, పీఎస్ హెచ్‌ఎం
ఇంతకన్నా ఎక్కువమంది ఉంటే ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీని అదనంగా నియమించవచ్చు.