స్వాధీనం చేసుకున్న బంగారం బమ్మిడి రవికుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
శ్రీకాకుళం రూరల్/కాశీబుగ్గ/మందస/వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం, విజయనగరం ఆర్టీసీ రీజియన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా పనిచేస్తున్న బమ్మిడి రవికుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఉంటున్న ఇల్లుతో పాలు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో 7 చోట్ల సోమవారం ఏక కాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. విలువైన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపిన వివరాలు ఇలావున్నాయి.
శ్రీకాకుళం నగరంలోని గోవిందనగర్‌కు చెందిన బమ్మిడి రవికుమార్ 1987లో ఆర్టీసీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధుల్లోకి చేరారు. వైజాగ్, విజయనగరం తదితర ప్రాంతాల్లో అప్పట్లో పనిచేశారు. 2010లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొంది శ్రీకాకుళంలోనే పనిచేస్తున్నారు. గడచిన మూడు నెలలుగా శ్రీకాకుళం, విజయనగరం రీజియన్‌కు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడగట్టారన్న సమాచారంతో ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర పర్యవేక్షణలో ఏసీబీ అధికారులు ఆయన నివాసం ఉంటున్న ఇల్లుతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని గోవిందనగర్‌తో పాటు పలాస, పూండి, మందస ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఏక కాలంలో సోదాలు జరిపారు.
రవికుమార్ బావమరిది అమరసింహుడు ఆర్‌టీసీలో ఛీప్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఇంట్లో కూడా తనిఖీలు చేయగా వీరిద్దరూ కలిసి ఇదివరకూ చేసిన ట్రాంజేషన్స్ పత్రాలను గుర్తించారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న రవికుమార్ మేనల్లుడు దువ్వాడ రామారావు ఇంట్లో తనిఖీలు చేయగా విలువైన డాక్యుమెంట్‌లు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఇతరత్రవి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే నగరంలోని న్యూకాలనీలో కట్టించిన 20 ప్లాటులకు సంబంధించిన పత్రాలు కూడా గుర్తించారు. అదేవిధంగా పలాస ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్ స్నేహితుడు శివకుమార్ ఇంట్లో(పలాస), మందసలో నివాసం ఉంటున్న రవికుమార్ మరో బావమరిది వాయిపల్లి రామారావు ఇంట్లో, రవికుమార్ బార్య ధనలక్ష్మీ అన్నయ్య చాపర కోదండరాం ఇంట్లో తనిఖీలు చేశారు. అలాగే వజ్రపుకొత్తూరు మండలంలోని పూండిలో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్, సాయివినీత్ విద్యా సంస్థల్లో దాడులు జరిగాయి. బమ్మిడి రవికుమార్‌కు వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ సీహెచ్ కోదండరావు, డాక్టర్ కె.లీల బంధువులు కావడంలో ఇక్కడ దాడులు చేపట్టారు. ఏక కాలంలో సోదాలు చేయగా జాయింట్ అకౌంట్స్‌తో కలిసి విరివిరిగా విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు వివరించారు.
మూడు కోట్ల ఆస్తులు గుర్తింపు
బమ్మిడి రవికుమార్‌తో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లల్లో ఆయా ప్రాంతాల్లో ఏడు చోట్ల జరిగిన సోదాల్లో ప్రస్తుతం రూ.3 కోట్లు ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దొరికిన డాక్యుమెంట్లును పూర్తిస్థాయిలో ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. అయితే శ్రీకాకుళం పరిధిలో మాత్రం రూ.2 లక్షలు నగదు, కేజీ బంగారం, బ్యాంకుల్లో రూ.15 లక్షలు, ఇతరత్రా బిల్డింగ్‌లు, రియల్‌ఎస్టేట్ డాక్యుమెంట్ పత్రాలు వారి కుటుంబ సభ్యుల పేర్లుమీద ఉన్నవాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఏసీబీ అధికారుల ఆధీనంలో ఉన్నాడని మంగళవారం అరెస్టు చూపిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన 20 మంది అధికారులు పాల్గొన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment