జేసీ–2నాగేశ్వరరావు కుమారుడు డీఈఈ రాజేష్‌చంద్ర సమక్షంలో సోదాలు చేస్తున్న సిబ్బంది
విశాఖ క్రైం : విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగులంతా ఇన్నాళ్లూ ఎంతో గొప్పగా భావించిన జిల్లా జేసీ–2 కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఇరుక్కోవడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో కీలక అధికారిగా ఉన్న నాగేశ్వరరావు ఇంట్లోనే ఏసీబీ సోదాలు జరగడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారుల్లో గుబులురేగుతోంది. విజయనగరంలో మూడు చోట్ల, విశాఖ నగరంలో ఆరుచోట్ల, బెంగళూరులో ఒక చోట ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు.
ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో సీఐ గఫూర్, సిబ్బంది విజయనగరంతోపాటు విశాఖపట్నంలోని పెదవాల్తేరు విజయనగర్ ప్యాలెస్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ చంద్ర ఇంట్లో సోదాలు చేశారు. సోదాల్లో రూ. 4.5కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినా... మార్కెట్‌లో వాటి విలువ రూ.20కోట్లకు పైనే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. జేసీ –2గా కాకర్ల నాగేశ్వరరావు 2017 జూన్ 20వ తేదీన చేరారు.
వెలుగుచూసిన ఆస్తులివీ...
విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలోని 775 చదరపు అడుగుల ఖాళీ స్థలం.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 484 గజాల స్థలం.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కండతామరాపల్లిలో 52సెంట్ల భూమి. అదే గ్రామంలో మరో రెండు చోట్ల 61 సెంట్ల భూమి.
కుటుంబ సభ్యుల పేరిట స్థలాలు
కుమారుడు రాజేష్‌చంద్ర పేరు మీద తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 14 సెంట్ల ఖాళీ స్థలం, నగరంలోని రేసపువానిపాలెంలో కృష్ణా అపార్ట్‌మెంట్‌లో ఒక ప్లాటు,
తల్లి ధనలక్ష్మి పేరు మీద సూర్యారావుపేట శశికాంత్‌నగర్‌లో 1250 చదరపు అడుగుల ఇల్లు, ఎండాడలో ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి లే అవుట్‌లో 633 చదరపు గజాల స్థలం.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో ఎకరం భూమి, మధురవాడ దరి ఎండాడలో 389 చదరపు గజాల ఖాళీ స్థలం, ఎండాడలోనే 231 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 485 చదరపు గజాల స్థలం వుంది.
సీతమ్మధార బాలయ్యశాస్త్రి లే అవుట్‌లో రూ.68లక్షల విలువ చేసే ప్లాట్ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.
బినామీల పేరిట రెండు ఫ్లాట్లు: పెదవాల్తేరు విజయనగర్‌ప్యాలెస్ లే అవుట్‌లో 511వ నంబరు గల ఫ్లాట్ శ్రీరామకృష్ణరాజు పేరు మీద వుంది. అదే ప్యాలెస్‌లో మరో ఫ్లాటు రమణమూర్తి రాజు పేరిట వుంది.
705 గ్రాముల బంగారు ఆభరణాలు, 5567 గ్రాముల వెండి, రూ.19.91లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.12.75లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లు, రెండు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు.- డిప్యూటీ తహసీల్దార్ నుంచి జేసీ–2 వరకూ
ప్రస్తుతం విజయనగరం జేసీ–2గా విధులు నిర్వర్తిస్తున్న కాకర్ల నాగేశ్వరరావు 1990 మార్చి 16న తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ బాధ్యతలు మొదలెట్టారు. 1998 జూన్‌లో తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అనంతరం పదోన్నతులతో జూన్ 2003న డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. విశాఖ హెచ్‌పీసీఎల్, నర్సీపట్నంలో డీఆర్వోగా విధులు నిర్వర్తించారు. సింహాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్‌గా చేశారు. ఆర్డీఓగా జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆర్డీవోగా, డుమా పీడీగా, గుంటూరు ఏజేసీగా, విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈఓగా విధులు నిర్వర్తించారు.
మే నెలలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఈ ఏసీబీ కేసు ఆయన సర్వీసులో మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. సోదాలలో డీఎస్పీలు రామకృష్ణప్రసాద్, కరణం రాజేంద్ర, షఖీలా బాను, సీఐలు గణేష్, లక్ష్మాజీ, గొలగాని అప్పారావు, రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment