అధికారిక లెక్కల ప్రకారం మన జిల్లాలో 10 మండలాలలో బాలికల, బాలుర నిష్పత్తిలో చాలా తేడా ఉంది. అందులో సంస్థాన్‌నారాయణపురం మండలంలో అతితక్కువ బాలికలు ఉన్నట్లు నమోదైంది.
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అధికారిక లెక్కల ప్రకారం మన జిల్లాలో 10 మండలాలలో బాలికల, బాలుర నిష్పత్తిలో చాలా తేడా ఉంది. అందులో సంస్థాన్‌నారాయణపురం మండలంలో అతితక్కువ బాలికలు ఉన్నట్లు నమోదైంది. ఎక్కువగా గిరిజన ప్రాంతాలు, నిరక్షరాస్యత అధికంగా ఉన్న మండలాలలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు వరుసగా నారాయణపురం 832, చందంపేట 834, మునుగోడు 842, పెద్దవూర 849, త్రిపురారం 853, మర్రిగూడ 863, భూదాన్‌పోచంపల్లి 867, చిట్యాల 883, ఆత్మకూరు(ఎం) 892, వలిగొండ 894 మంది మాత్రమే బాలికలు ఉన్నారు.
పాఠశాలలో సైతం లింగవివక్ష
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో కూడా బాలుర, బాలికల మధ్య లింగ వివక్ష కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలకు, అదే అబ్బాయిలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ వివక్ష ప్రదర్శిస్తున్నారు. పోచంపల్లి మండలాన్ని తీసుకుంటే గౌస్‌కొండతండా ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు బాలురులు ఉండగా 14 మంది బాలికలు ఉన్నారు. గౌస్‌కొండలో బాలురు 6, బాలికలు 24, దంతూర్‌లో బాలురు 15, బాలికలు 33, వంకమామిడి హైస్కూల్‌లో 20 మంది బాలురు ఉండగా బాలికలు 42, జూలూరులో 73 మంది బాలురు, 132 మంది బాలికలు ఉన్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో బాలురు అధికంగాను , బాలికలు తక్కువగా ఉన్నారు. ఇలా బడికి పంపే విషయంలో కూడా లింగ వివక్షను ప్రదర్శిస్తున్నారు.
లింగ వివక్షకు కారణాలు ఏమిటి ?
అనాదిగా తల్లిదండ్రులు ఆడ పిల్లల పట్ల వివక్షను చూపుతున్నారు. ఆడపిల్ల పుడితే బాధపడటం, అదే మగ బిడ్డ పుడితే పండగలు చేస్తుంటారు. పౌష్టికాహారం, విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ విషయంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతుంది. అదీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, నిరక్షరాస్యులలో ఎక్కువగా కనిపిస్తుంది. మనం కోసం మనం అనే కార్యక్రమంలో లింగ వివక్షను రూపుమాపడానికి గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షుడిగా, వీఆర్వో కన్వీనర్‌గా ఉంటారు. వీరు వంద రోజులలో గ్రామస్తుల సహకారంతో భ్రూణ హత్యలు, లింగ వివక్షపై ప్రజలను చైతన్యం చేస్తారు.