ఇక బ్యాంకులపై అభాండాలు!
బాబు సర్కారు తాజా ఎత్తుగడ
రుణమాఫీలో జాప్యానికి కారణం
బ్యాంకులేనని చెప్పే ప్రయత్నం
భారాన్ని తగ్గించుకోవడానికి మొత్తం 30 పరిమితులు
హైదరాబాద్: రుణమాఫీపై ఎటూ తేల్చకుండా వాయిదా వేసుకుంటూ పోతున్న ప్రభుత్వం.. తాజాగా అందుకు కారణం బ్యాంకులని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ‘ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టుగా..’ ఎన్నికల హామీ అమలులో చేయడంలో తన వైఫల్యానికి బ్యాంకులను సాకుగా ఎంచుకుంటోంది. వ్యవసాయ రుణాల మంజూరులో గత కొన్నేళ్లుగా బ్యాంకర్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, అవన్నీ బయట పడతాయన్న భయంతో రుణమాఫీకి సహకరించడం లేదనే ప్రచారాన్ని ప్రారంభించింది. ‘‘వ్యవసాయ రుణాల పేరిట కోట్లాది రూపాయల మేర అనర్హులకు పందేరం చేశాయి. వడ్డీ వ్యాపారులకు, ఇతర బడా వ్యక్తులకు రుణాలు ఇచ్చాయి. వ్యవసాయ రుణాలపై వడ్డీ నాలుగు శాతమే కనుక పలు బ్యాంకుల్లో ఈ అనర్హుల రుణాలే అధికంగా ఉన్నాయి. పైగా కొన్ని చోట్ల బంగారం తీసుకున్నట్లు పేపర్లపై రాసుకోవడమే తప్ప వాస్తవానికి బంగారం లేకుండానే రుణాలు ఇచ్చారు. మరికొన్ని చోట్ల సరైన భూమి పత్రాలు కూడా లేకుండానే వ్యవసాయ రుణాలు ఇచ్చేశాయి. ఇదో పెద్ద కుంభకోణం. బ్యాంకుల మేనేజర్లు, ఇతర అధికారులు ఇందులో ఉన్నారు. అనేకచోట్ల కమీషన్లు భారీగా తీసుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి బ్రాంచీల వారీగా రైతుల జాబితాలను ఇవ్వాలని అడుగుతుండడంతో ఆ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఎంత వత్తిడి చేసినా మభ్యపెట్టే మాటలు చె బుతూ కాలక్షేపం చేస్తున్నారు’’ అంటూ రుణమాఫీపై ప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుగా ఉన్న ముఖ్యుడొకరు ఆరోపణలు గుప్పించారు. ‘బంగారంపై రూ.40 వేల కోట్ల వరకు పంట రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. అంత మొత్తానికి రుణమివ్వాలంటే రూ.2 వేలకు ఒక గ్రాము చొప్పున 200 టన్నుల బంగారం బ్యాంకుల్లో ఉండాలి. అంత బంగారం బ్యాంకర్ల వద్ద ఉందా? అంత బంగారం ఉంచేందుకు వీలుగా ఎన్ని బ్యాంకు బ్రాంచీల్లో లాకర్లు ఉన్నాయి? అంతపెద్ద మొత్తంలో బంగారాన్ని నిల్వచేసే సామర్థ ్యం బ్యాంకు బ్రాంచీల్లో లేనేలేదు’’ అని ఆ సలహాదారు వివరించారు.
ఆంక్షలే ఆంక్షలు..: మరోవైపు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికి 18 పరిమితులు విధిం చిన ప్రభుత్వం.. ఆర్ధిక భారాన్ని మరింతగా తగ్గించుకునేందుకు తాజాగా మరో 12 ఆంక్షలను విధిస్తూ కొత్త నిబంధనలను చేర్చింది. ‘మొత్తం 30 పరిమితులతో కూడిన పట్టికను ప్రభుత్వం బ్యాంకర్లకు ఇచ్చింది. పట్టికలో ఉన్న అంశాలననుసరించి మాత్రమే మాఫీకి అర్హులైన రైతులను గుర్తించాలని స్పష్టం చేసింది. ఈ పరిమితులకు లోబడి మాత్రమే పంటరుణాలు తీసుకున్న రైతుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది...’ అని సలహాదారు వివరించారు.