అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలపై మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లపై ఒత్తిడి పెంచుతున్నామని భావించవద్దన్నారు. మనకున్న వనరులు మరే రాష్ట్రంలో లేవని, మనకున్న వ్యవస్థ మరే దేశంలో లేదని అన్నారు. అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు, ఈ-పోస్ యంత్రాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సమగ్ర పల్స్ సర్వే చేశాం.. ట్యాబ్‌ల వినియోగం పెంచామన్నారు.
వచ్చే నెల నుంచి ఫైబర్ గ్రిడ్ ప్రారంభమవుతుందని, పది లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. వీటన్నిటిని వినియోగించుకుని ప్రస్తుత సమస్యను అధిగమించాలని, ఇదొక జాతీయ విపత్తుగా భావించి సమష్టిగా పనిచేయాలని సూచించారు. నగదు తక్కువ ఉంది.. ఈఐపోస్ మిషన్లు తక్కువ ఉన్నాయి.. అయినా పరస్పర సమన్వయంతో సమస్యను అధిగమించాలని చంద్రబాబు అన్నారు.
డిసెంబర్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు అధికంగా జరగాలని, మొబైల్ బ్యాంకింగ్‌పై శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు జరపాలని, ఇంటింటా ప్రచారం నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ‘వెలుగు’ సిబ్బంది, ‘నరేగా’ సూపర్‌వైజర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా చూశాం.. అలాగే నగదు లోటు ఉన్నప్పటికీ దైనందిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా చూడాలని బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థిక శాఖాధికారులు పాల్గొన్నారు.