నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్‌లో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ శుక్రవారం నుంచి విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో www.ttdrevoanine.com వెబ్‌సైట్ ద్వారా టికెట్లకు ధరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి వారం రోజుల పాటు గడువు ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టికెట్లు పొందిన వారు వారంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది.
నేడు డయల్ యువర్ టీటీడీ ఈవో : తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే ‘డయల్ యువర్ టీటీడీ ఈవో’ కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877– 2263261 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో మాట్లాడవచ్చు.
నేటి నుంచి దివ్యదర్శనం రద్దు : తిరుమలలో గురువారం అర్ధరాత్రి తర్వాత కాలిబాట దివ్య దర్శనం టికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వకూడదని టీటీడీ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానాన్ని టీటీడీ శుక్రవారం నుండి అమలు చేసిం ది. ఆ మూడు రోజుల్లో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడిచివచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లతో పాటు లడ్డూ టోకెన్లు కూడా ఇవ్వబోరు.