నారాయణ విద్యా సంస్థలపై చర్యలు | Actions on Narayana educational institutions | Sakshi
Sakshi News home page

నారాయణ విద్యా సంస్థలపై చర్యలు

Published Sat, May 5 2018 1:41 AM | Last Updated on Sat, May 5 2018 1:43 AM

Actions on Narayana educational institutions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్, జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి విద్యా సంస్థల్లో చదివిన వారిగా, వారికి ర్యాంకులు తెప్పించిన క్రెడిట్‌ తమదేనన్న అర్థం వచ్చేలా నారాయణ విద్యాసంస్థ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తోందని శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ బీఎస్‌రావు, డైరెక్టర్‌ సుష్మ పేర్కొన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను నారాయణ విద్యా సం స్థల విద్యార్థులుగా చెప్పుకోవడం తప్పని అన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు చేపట్టే వీలుందని, భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే చర్యలు తప్పవన్నారు. శుక్రవారం వీరు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విద్యారంగంలో విశేష కృషి చేయాలన్న ఉద్దేశంతో ఐదేళ్ల కిందట శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు సంయుక్తంగా శార్వాణి విద్యాసంస్థలను (చైనా బ్యాచ్‌) ఏర్పా టు చేశాయని, అయితే అన్ని అంశాల్లో నారా యణ విద్యా సంస్థల నుంచి సహకారం అందడం లేదని చెప్పారు. గతేడాది నుంచే సమావేశాలు జరగలేదని, దీంతో కీలక నిర్ణయాలు ఆగిపోయాయన్నారు. గత అక్టోబర్‌లో కేసులు పెట్టడం వంటి చర్యలతో దూరమయ్యామని, గత నెల 12న జరిగిన చివరి సమావేశంలో తెగదెంపులు చేసుకున్నామన్నారు. శార్వాణికి పంపించిన ఎవరి విద్యార్థుల బాధ్యత వారిదేనని, ఎవరి విద్యార్థుల ర్యాంకులను వారే ప్రకటించుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రస్తు తం అదే కొనసాగు తోందన్నారు. అయితే, మొన్నటి జేఈఈ ర్యాం కుల్లో శ్రీచైతన్య విద్యార్థులను నారాయణ విద్యార్థులుగా చూపించుకున్నారని చెప్పారు.

తాము శార్వాణికి పంపించినవారే కాకుండా తమ విద్యాసంస్థలో ఇంటర్‌ చదివిన వారి సక్సెస్‌ కూడా నారాయణ సంస్థలదే అన్నట్లుగా ప్రకటనలు ఇచ్చి తప్పు చేశారన్నారు. ఏపీ ఇంటర్‌ పరీక్షఫలితాల్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండు సంస్థలకు చెందిన వారుగా ఇచ్చారని, ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల తో సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను చేర్పించాలన్నారు. చైనా పేరుతో ఇకపై ఉండబోదని, ఇక సెకండియర్‌ బ్యాచ్‌ ఒకటే ఉందని, అదే చివరిదని స్పష్టంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement